Homeతెలంగాణరైతుల తీర్పును ఎదుర్కోండి మాజీ ఎంపిటిసి రమేష్

రైతుల తీర్పును ఎదుర్కోండి మాజీ ఎంపిటిసి రమేష్

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 10:

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలకు ప్రభుత్వం దూరంగా ఉండటంపై బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీటీసీ శీలం శెట్టి రమేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల ఓటు హక్కును పక్కనపెట్టి నామినేటెడ్‌ విధానంలో పదవులను భర్తీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. రైతులపై నమ్మకం ఉంటే ఎన్నికలు నిర్వహించి వారి తీర్పును స్వీకరించాలని సోమవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను కాపాడటంలో PACSలు కీలకపాత్ర పోషిస్తున్నాయని సభ్యత్వం, వాటా హక్కులు, ఓటు హక్కుల ఆధారంగా రైతులు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ఉండాలని డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పాలకవర్గాలను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం వల్లే సహకార వ్యవస్థకు ప్రజాస్వామ్య బలం చేకూరుతుందని తెలిపారు.

*రైతుల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేదా?*

ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, వాటి అమలుపై రైతుల్లో అసంతృప్తి ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సహకార సంఘం ఎన్నికలకు ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని రమేష్‌ ప్రశ్నించారు. రైతుల తీర్పును ఎదుర్కొనే భయం ఉందని అందుకే ఎన్నికలను పక్కనపెట్టి దొడ్డిదారిన పదవులను పంచుతున్నారా అని నిలదీశారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, రైతులపై విశ్వాసం ఉంటే ఎన్నికలు నిర్వహించి వారి ఓట్లతో పాలకవర్గాలను ఎన్నుకోవాలని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నామినేషన్ల ద్వారా పదవులను భర్తీ చేయడం ఎన్నికలకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.
*సహకార సంఘాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు*

ప్రాథమిక సహకార సంఘాలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన సంస్థలు కావని, అవి రైతుల సొంత వ్యవస్థలని రైతుల సభ్యత్వం, వాటా సొమ్ము, కష్టంతో ఏర్పడిన సహకార సంఘాల్లో రాజకీయ జోక్యాన్ని పెంచడం సరికాదన్నారు.

*రైతులే పాలకవర్గాలను ఎన్నుకునేలా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి.*

నామినేటెడ్‌ పదవుల పేరుతో రైతుల ఓటు హక్కును హరించే ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పిఎసిఎస్ ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి రైతులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించాలని శీలం శెట్టి రమేష్‌ డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular