Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఆదివాసీ ‘జల్‌–జంగల్‌–జమీన్‌’ హక్కులు ఏనాటికి సాధ్యం?

ఆదివాసీ ‘జల్‌–జంగల్‌–జమీన్‌’ హక్కులు ఏనాటికి సాధ్యం?

ఆరు దశాబ్దాల్లో ఆరు కోట్ల స్థానభ్రంశం.. అందులో 40 శాతం ఆదివాసులే! 

అభివృద్ధి పేరుతో ప్రాజెక్టులు వస్తున్నాయి.. భూములు పోతున్నాయి.. తరతరాలుగా అడవినే జీవనాధారంగా చేసుకున్న ఆదివాసీలకు మాత్రం పునరావాసం, పరిహారం, హక్కులు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదం దశాబ్దాలుగా మార్మోగుతున్నా, ఆచరణలో ఆదివాసీ జీవితం మాత్రం పునరావృత స్థానభ్రంశం, పేదరికం, నిర్లక్ష్యంతోనే సాగుతోంది.

ఎడిటర్, పెన్ పవర్ ఆగష్టు 10:

అభివృద్ధి పేరుతో ఆదివాసీ నిర్వాసితులు :
దేశ జనాభాలో ఆదివాసీలు సుమారు 8.6 శాతం మాత్రమే. అధికారిక గణాంకాల ప్రకారం 10.45 కోట్లకు పైగా ఉన్న ఈ జనాభా ప్రధానంగా అడవులు, కొండలు, సహజ వనరులతో ముడిపడి జీవిస్తోంది. అయితే దేశ అభివృద్ధి ప్రస్థానంలో అదే సహజ వనరులు ఆదివాసీలకు వరంగా కాకుండా, అనేక సందర్భాల్లో శాపంగా మారుతున్నాయి. 1947 నుంచి ఇప్పటివరకు అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో దేశవ్యాప్తంగా సుమారు ఆరు కోట్ల మంది స్థానభ్రంశానికి గురైనట్లు వివిధ అధ్యయనాలు, అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. వీరిలో దాదాపు 40 శాతం ఆదివాసీలేనన్నది ఆందోళన కలిగించే అంశం. దేశ జనాభాలో పదో వంతుకంటే తక్కువగా ఉన్న ఒక వర్గం.. అభివృద్ధి భారాన్ని మాత్రం అసమానంగా మోస్తోంది. జలాశయాలు, భారీ నీటి ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు, గనులు, పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు.. పేర్లు మారుతున్నా ఫలితం మాత్రం ఒకటే. భూమి కోల్పోయేది ఆదివాసీ.. అడవి కోల్పోయేది ఆదివాసీ.. జీవనాధారం కోల్పోయేది కూడా ఆదివాసీయే.

నీటి ప్రాజెక్టుల్లోనే లక్షలాది నిర్వాసితులు :

నీటి, విద్యుత్ ప్రాజెక్టుల కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల మంది నిర్వాసితులయ్యారని అంచనాలు ఉన్నాయి. అందులో 63.21 లక్షల మంది ఆదివాసీలే. అంటే భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక మూల్యం చెల్లిస్తున్న వర్గాల్లో గిరిజన సమాజం ముందువరుసలో ఉంది. గనులు, ఖనిజాల వెలికితీత పేరుతో సుమారు 25.5 లక్షల మంది స్థానభ్రంశం చెందగా, వారిలో 19.20 లక్షల మంది ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75 శాతం వరకు గిరిజనులే. పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన సుమారు 12.5 లక్షల మందిలో 8.75 లక్షల మంది ఆదివాసులు ఉన్నట్లు లెక్కలు సూచిస్తున్నాయి. మరోవైపు వన్యప్రాణి సంరక్షణ పార్కులు, అభయారణ్యాల ఏర్పాటు పేరుతోనూ దాదాపు పది లక్షల మంది గిరిజనులు తమ తరతరాల నివాస ప్రాంతాల నుంచి దూరమయ్యారు. అభివృద్ధి అవసరమే. కానీ అభివృద్ధి ఫలితాలు అందరికీ సమానంగా అందనప్పుడు.. దాని కోసం ఒకే వర్గం పదేపదే బలికావాల్సి వస్తే.. ఆ అభివృద్ధి నమూనాపై ప్రశ్నలు తలెత్తడం సహజమే.

హక్కుల చట్టాలున్నా.. పట్టాల కోసం ఎదురుచూపులే :
ఆదివాసీల భూమి, అటవీ హక్కులకు రక్షణ కల్పించేందుకు అటవీ హక్కుల చట్టం–2006, పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ) చట్టం–1996 (పీసా)వంటి చట్టాలు ఉన్నాయి. కానీ చట్టం ఉండటం ఒక ఎత్తయితే.. దాని స్ఫూర్తిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం మరో ఎత్తుగా మారింది. తరతరాలుగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ సరైన భూ రికార్డులు, పట్టాలు లేకపోవడంతో అనేక మంది ఆదివాసీలు చట్టబద్ధమైన హక్కులను కోల్పోతున్నారు. ఫలితంగా ప్రాజెక్టుల కోసం భూములు తీసుకున్నప్పుడు పరిహారం, పునరావాసం వంటి ప్రయోజనాలు పొందడంలోనూ వారు వెనుకబడుతున్నారు. అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్నా.. దేశంలో కోట్లాది మంది ఆదివాసీలు కనీసం హక్కుల కోసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 54 లక్షల అటవీ హక్కుల పట్టాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు లెక్కలు చెబుతుండగా, ఇప్పటివరకు 28.38 లక్షల మందికే పట్టాలు మంజూరయ్యాయి. అంటే 47 శాతానికి మించి లేదు. మరో 18.12 లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దాదాపు ఆరు లక్షల దరఖాస్తులు ఇంకా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 2.88 లక్షల దరఖాస్తులు రాగా, 2.28 లక్షల మందికి పట్టాలు అందాయి. సుమారు 58 వేల దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, నాలుగు వేలకుపైగా దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఎక్కడ? :
అడవిలో ఆదివాసీ సేకరించే ప్రతి అటవీ ఉత్పత్తి వెనుక తరతరాల జ్ఞానం, శ్రమ, ప్రకృతితో ముడిపడిన జీవన విధానం ఉంటుంది. తేనె, చింతపండు, నల్లజీడి, చీపుర్లు, తుమ్మబంక, ఉసిరి వంటి అటవీ ఉత్పత్తులతో పాటు కాఫీ, కొర్రలు, వరి, రాగి, రాజ్మా, పసుపు, చిక్కుళ్లు వంటి పంటలు గిరిజన కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరులు. 1955లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ (జీసీసీ ) ఈ ఉత్పత్తుల సేకరణ, వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తోంది. గిరిజనుల నుంచి సేకరించిన ఉత్పత్తులతో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నా.. అసలు ఉత్పత్తిదారుడైన గిరిజన రైతుకు ఎంత మేరకు న్యాయమైన ధర దక్కుతోందన్న ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ప్రైవేటు దళారుల దోపిడీని అరికడతామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో గిరిజన ఉత్పత్తిదారుడికి మార్కెట్‌పై పూర్తి అవగాహన, నిల్వ సదుపాయాలు, రవాణా, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి వ్యవస్థలు బలపడాల్సిన అవసరం ఉంది.

పర్యాటకం పెరుగుతోంది.. ఆదివాసీ జీవితం మాత్రం మారడం లేదు :
ఆదివాసీ ప్రాంతాల్లో పర్యాటక అవకాశాలు విస్తరిస్తున్నాయి. అరకు, బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి వంటి ప్రాంతాలకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. పర్యాటక రంగం ద్వారా భారీ ఆదాయ లక్ష్యాలను ప్రభుత్వాలు నిర్దేశించుకుంటున్నాయి.కానీ ఈ అభివృద్ధిలో స్థానిక ఆదివాసీ సమాజానికి లభిస్తున్న వాటా ఎంత? పర్యాటక ప్రాజెక్టుల్లో స్థానికులకు శాశ్వత ఉపాధి ఎంత? స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ ఎంత? నిర్ణయ ప్రక్రియలో ఆదివాసీల భాగస్వామ్యం ఎంత? అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదు.అటవీ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పేరుతో కొత్త ప్రాజెక్టులు వస్తున్నా.. స్థానికుల జీవనోపాధి, సంప్రదాయ హక్కులు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉంది.

ఉత్తరాంధ్ర వనరుల నుంచి ఆదాయం.. గిరిజనులకు మాత్రం వెనుకబాటే :
ఉత్తరాంధ్రలో ఆదివాసీ ప్రాంతాల్లోనే పలు భారీ జలవిద్యుత్, నీటి ప్రాజెక్టులు ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాలు మాత్రం ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదన్న విమర్శలు ఉన్నాయి. గనుల తవ్వకాల ద్వారా కూడా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోంది. 2025–26లో ఆంధ్రప్రదేశ్‌లో గనుల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. ఖనిజ సంపద ఉన్న ప్రాంతాల అభివృద్ధిలో స్థానిక ఆదివాసీలకు నేరుగా వాటా కల్పించే విధానం అవసరమనే డిమాండ్ బలపడుతోంది. ఒడిశాలో అమలు చేస్తున్న విలువ ఆధారిత విధానాల తరహాలో స్థానిక వనరుల ఆధారంగా ప్రాసెసింగ్, విలువ జోడింపు పరిశ్రమలను ఆదివాసీ ప్రాంతాల్లోనే అభివృద్ధి చేస్తే.. ఉపాధి, ఆదాయం, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఐటీడీఏలు ఉన్నా.. అత్యవసర సేవలకు డోలీలే దిక్కు :
గిరిజన సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థలు ఐటీడీఏలు ఉన్నప్పటికీ.. నిధుల కొరత, పరిపాలనా జాప్యం, సమన్వయ లోపాలు అభివృద్ధి పనులను నెమ్మదింపజేస్తున్నాయి. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాల విషయంలో ఇప్పటికీ అనేక ఆదివాసీ గ్రామాలు వెనుకబడి ఉన్నాయి. సీజనల్ విషజ్వరాలు, రక్షిత మంచినీటి కొరత, గర్భిణులకు అత్యవసర రవాణా సదుపాయాల లేమి వంటి సమస్యలు ఏటా పునరావృతమవుతున్నాయి. అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి చేరుకోవడమే సవాలుగా మారే పరిస్థితులు ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్నవారిని, మరణించినవారి మృతదేహాలను మోటార్‌సైకిళ్లు, ఆటోలు, డోలీలపై తరలించాల్సిన దుస్థితి పూర్తిగా తొలగిపోలేదు.

దశాబ్దం దాటినా ‘పేదలబూడు’కు పూర్తి అభివృద్ధి ఎప్పుడు?:
అరకు ప్రాంతంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని పలుమార్లు వ్యక్తం చేసిన అప్పటి/ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2016లో పేదలబూడును దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కానీ దశాబ్దం సమీపిస్తున్నా పేదలబూడు వందశాతం అభివృద్ధి సాధించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడి లిట్టిగూడ పాఠశాల మూసివేయడంతో విద్యార్థులు చదువుకోడానికి సుమారు మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న స్థానికుల ఆవేదన.. అభివృద్ధి హామీలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టం చేస్తోంది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం కంటే.. ఆ గ్రామానికి నిరంతర విద్య, వైద్యం, తాగునీరు, రహదారి, ఉపాధి, డిజిటల్ సౌకర్యాలు కల్పిం చే శాశ్వత కార్యాచరణ అవసరం.

అల్లూరి నుంచి నేటి తరం వరకు .. హక్కుల పోరాటమే స్ఫూర్తి:

అడవి, భూమి, స్వయం పాలన కోసం ఆదివాసీ సమాజం చేసిన పోరాట చరిత్ర సుదీర్ఘమైనది. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్, బిర్సా ముండా  వంటి పోరాట యోధులు తమ హక్కుల కోసం సాగించిన ఉద్యమాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమే. ఆ పోరాటాల సారాంశం కేవలం భూమి కోసం పోరాటం కాదు. తమ సహజ వనరులపై హక్కు, తమ జీవన విధానంపై నిర్ణయాధికారం, తమ సంస్కృతి–భాషల పరిరక్షణ, తమ ప్రాంత అభివృద్ధిలో తమ భాగస్వామ్యం కోసం సాగిన పోరాటం. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆదివాసీ హక్కులకు సంబంధించిన చట్టాలను సమర్థంగా అమలు చేస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. భారతదేశంలోనూ చట్టాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా.. కాలపరిమితితో, బాధ్యతాయుతమైన వ్యవస్థతో అమలు కావాల్సిన అవసరం ఉంది.

చట్టం స్ఫూర్తి నిలవాలి.. జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదం ఆచరణలోకి రావాలి:
1/70 నిబంధనల స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్యలు, ఆదివాసీ భూములపై వివిధ రూపాల్లో ఏర్పడుతున్న ఒత్తిళ్లు, సహజ వనరుల వినియోగంలో స్థానికుల భాగస్వామ్యం లేకపోవడం వంటి అంశాలపై సమగ్ర పునరాలోచన అవసరం. ఆదివాసీల అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాలు అందించడం కాదు. వారి భూమిని రక్షించడం, అటవీ హక్కులను గుర్తించడం, నాణ్యమైన విద్య అందించడం, అత్యవసర వైద్య సేవలను గ్రామం దగ్గరకు తీసుకురావడం, స్థానిక ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఉపాధి అవకాశాలు పెంచడం, పర్యాటకం–గనులు–పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయంలో స్థానిక సమాజానికి న్యాయమైన వాటా కల్పించడం. అభివృద్ధి పేరుతో తరతరాల జీవనాధారాన్ని కోల్పోయే పరిస్థితి ఇకపై ఉండకూడదు. ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి (ఆదివాసీలను తొలగించి కాకుండా.. వారిని భాగస్వాములను చేసి) జరగాలి.

ఆదివాసీ లకు మరోసారి వినిపించాల్సిన నినాదం ఒక్కటే కాదు.. అది ఒక జీవన హక్కు: “మన అడవి.. మన భూమి.. మన పాలన.” ఈ నినాదం కేవలం సభల వేదికలపై మార్మోగకుండా.. ప్రభుత్వ విధానాల్లో, చట్టాల అమలులో, అభివృద్ధి ప్రణాళికల్లో ఆచరణ రూపం దాల్చినప్పుడే ఆదివాసీ సమాజానికి నిజమైన న్యాయం జరిగినట్లవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular