గార్ల, పెన్ పవర్, ఆగస్టు 18:
గార్ల గ్రామ పంచాయతీ పరిధిలో కొంతకాలంగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. గ్రామంలోని ఫిల్టర్‌బెడ్‌ను మంగళవారం సీపీఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గార్ల మండల మాజీ వైస్ ఎంపీపీ కట్టేబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా నల్లాల ద్వారా తాగునీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వేసవి ప్రారంభానికి ముందే గ్రామంలో నీటి ఎద్దడి నెలకొనడం ఆందోళనకరమన్నారు. ఫిల్టర్‌బెడ్ వద్ద నీటి శుద్ధి ప్రక్రియ తరచూ నిలిచిపోవడానికి సాంకేతిక, నిర్వహణ లోపాలే కారణమని ఆరోపించారు. సమస్య తలెత్తిన ప్రతిసారీ తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఫిల్టర్‌బెడ్ వద్ద నిలిచిపోయిన నీటి శుద్ధి ప్రక్రియను వెంటనే పునరుద్ధరించి, గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. సమస్యపై అధికారులు తక్షణమే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే ప్రజలను సమీకరించి సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, భూక్య హరినాయక్, ధరావత్ వీరన్న, మాజీ ఉపసర్పంచ్ లావుడ్య భీముడు, మాగం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

