Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంఅచ్చెన్నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: ఆల్ఫా కృష్ణ

అచ్చెన్నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: ఆల్ఫా కృష్ణ

అచ్చెన్నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: ఆల్ఫా కృష్ణ

కౌన్సిల్‌లో బొత్స సత్యనారాయణను ‘దద్దమ్మ’ అని సంబోధించడం సరికాదు

విశాఖపట్నం: కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ‘దద్దమ్మ’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సంబోధించడం తీవ్ర అభ్యంతరకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ అన్నారు. బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విశాఖలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ఫా కృష్ణ మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు సభల్లో హుందాగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని విమర్శించారు.

‘దద్దమ్మ’ అనే పదంతో అచ్చెన్నాయుడిని ఎవరైనా సంబోధిస్తే ఆయన అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు పెద్దల సభల గౌరవాన్ని దిగజార్చుతాయని అన్నారు. అచ్చెన్నాయుడు సోదరుడు, దివంగత ఎర్రన్నాయుడు వంటి సీనియర్ నాయకులు పాటించిన రాజకీయ విలువలను గుర్తు చేసుకోవాలని సూచించారు.

డీఎస్సీపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?

అసెంబ్లీలో డీఎస్సీ అంశంపై చర్చ జరిపి, మెజారిటీ ఉందనే కారణంతో తీర్మానం చేసుకున్న అధికార పక్షం.. మరుసటి రోజు కౌన్సిల్‌లో అదే అంశంపై చర్చ అవసరం లేదని చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆల్ఫా కృష్ణ విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు.

అవినీతి జరగలేదని ప్రభుత్వం భావిస్తే స్వతంత్ర దర్యాప్తును ఎదుర్కోవడానికి ఎందుకు వెనుకాడుతోందని నిలదీశారు. డీఎస్సీ అంశంపై నిరుద్యోగ యువత ఆందోళనలు చేస్తున్న సమయంలో వైసీపీ కార్యక్రమాలపై స్పందించకుండా, ఆ తర్వాత భారీ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. యువతకు డీఎస్సీపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైఎస్సార్ పాలనను గుర్తు చేసిన ఆల్ఫా

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలపై కూడా విచారణకు సిద్ధమని చెప్పిన విషయాన్ని ఆల్ఫా కృష్ణ గుర్తు చేశారు. ప్రజా జీవితంలో విశ్వాసం, నైతికత, జవాబుదారీతనం అవసరమన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తప్పు నిర్ధారణ అయితే చర్యలు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలని అన్నారు.

‘బొత్సకు క్షమాపణ చెప్పాలి’

కౌన్సిల్‌లో బొత్స సత్యనారాయణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయనను మాత్రమే కాకుండా ఆయనను గౌరవించే ప్రజలను కూడా అవమానించేలా ఉన్నాయని ఆల్ఫా కృష్ణ అన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడిని సభలో అవమానించేలా మాట్లాడటం ద్వారా కాపుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో వెల్లడైందని ఆరోపించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అభివృద్ధి, డీఎస్సీ వ్యవహారం, ప్రస్తుత పాలనతో పాటు గత రాజకీయ పరిణామాలపై చర్చకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నామనే ధీమాతో ప్రతిపక్షాన్ని తక్కువ చేసి మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

క్షమాపణ చెప్పకపోతే పోరాటం

ఇప్పటివరకు ఓపికగా ఉన్నామని, ఇకపై అధికార పార్టీ నాయకులు చేసే ప్రతి వ్యాఖ్యకు వైసీపీ గట్టిగా సమాధానం ఇస్తుందని ఆల్ఫా కృష్ణ అన్నారు. అరెస్టులు, కేసులు, జైళ్లతో తమ గొంతును అణచలేరని పేర్కొన్నారు.

బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పకపోతే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు ప్రజల్లో బాధ్యతగా మెలగాలని, వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దూరంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular