- పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వేతనం పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్
- గిరిజన విద్యార్థుల భవిష్యత్తు కోసం సేవలందిస్తున్నా.. కనీస ఆదాయానికి నోచుకోని దుస్థితి
- గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 22:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు వారి మాతృభాషలో విద్యాబోధన చేస్తూ గిరిజన విద్యాభివృద్ధికి కీలకంగా సేవలందిస్తున్న మాతృభాషా విద్యా వాలంటీర్ల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం తక్షణమే పెంచాలని గూడెం కొత్తవీధి మండల మాతృభాషా ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు, బొర్రామామిడి ఎంపీపీ పాఠశాల మాతృభాషా వాలంటీర్ గెమ్మెల లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గిరిజన ప్రాంతాల్లో మాతృభాష తెలిసిన ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ, పాఠశాల విద్యకు–గిరిజన పిల్లల మాతృభాషకు మధ్య వారధిగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనం మాత్రం వారి శ్రమకు, బాధ్యతలకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు, కుటుంబ పోషణ వ్యయాలు గణనీయంగా పెరిగాయని, ఇప్పటికే అందుతున్న గౌరవ వేతనం కనీస దినసరి కూలీ స్థాయికి కూడా చేరకపోవడం బాధాకరమని లక్ష్మణరావు పేర్కొన్నారు. నెలంతా పాఠశాలల్లో విద్యార్థులకు సేవలందిస్తున్న మాతృభాషా వాలంటీర్లకు కుటుంబాన్ని పోషించుకునే స్థాయిలో ఆదాయం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.గిరిజన విద్యార్థులకు మాతృభాషలో విద్యాబోధన చేయడం వల్ల వారు పాఠ్యాంశాలను త్వరగా అర్థం చేసుకోవడంతో పాటు పాఠశాలపై ఆసక్తి పెంచుకుంటున్నారని ఆయన అన్నారు. గిరిజన విద్యలో మాతృభాషా వాలంటీర్ల పాత్రను గుర్తించి, వారి సేవలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు.ప్రభుత్వం మాతృభాషా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, వాలంటీర్లకు ప్రస్తుత జీవన వ్యయాలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలని, సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. అలాగే మాతృభాషా వాలంటీర్ల సేవలకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.“గిరిజన పిల్లల భవిష్యత్తు కోసం మా వంతు బాధ్యతగా విద్యాబోధన చేస్తున్నాం. ప్రభుత్వం మా సేవలను గుర్తించి, కనీస జీవన ప్రమాణాలకు అనుగుణంగా గౌరవ వేతనం పెంచాలి. ఇది మా వ్యక్తిగత డిమాండ్ కాదు.. గిరిజన విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం” అని గెమ్మెల లక్ష్మణరావు ప్రభుత్వాన్ని కోరారు.
మాతృభాష వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచాలి
RELATED ARTICLES

