కారులో మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
చింతూరు, పెన్ పవర్, ఆగస్టు 21:
ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఓవర్‌టేక్ చేయబోయిన కారు అదుపుతప్పి లారీని ఢీకొన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయానక పరిస్థితి నెలకొంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మంటల్లో చిక్కుకుని సజీవదహనం కాగా, మరో వ్యక్తిని అటుగా వెళ్తున్న వాహనదారులు సకాలంలో బయటకు తీసి కాపాడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే చింతూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

