ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్ 9:
ఉదయం ఆరు గంటలకే గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. రోజువారీ వ్యాయామంలో భాగంగా మైదానంలో వ్యాయామం చేస్తున్న 8వ తరగతి విద్యార్థి సాత్విక్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఉదయం వరకు తమ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడని భావించిన తల్లిదండ్రులకు కొద్దిసేపటికే అతడు మృతి చెందాడనే వార్త తెలియడంతో వారి గుండెలు పగిలిపోయాయి. రఘునాథపాలెం మండలంలోని బాలుర బీసీ గురుకుల పాఠశాలలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన సలిగంటి హరీష్, ప్రియాంక దంపతుల కుమారుడు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో గురుకుల పాఠశాలలోనే వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వ్యాయామ సమయంలో విద్యార్థి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు తెలిసింది.
కుమారుడి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. తమ కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడున్న వారిని సైతం కలచివేశాయి. విద్యార్థి మృతదేహానికి అవసరమైన వైద్యపరమైన ప్రక్రియలు నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులు విద్యార్థి నేత్రాలను దానం చేశారు. అనంతరం మృతదేహాన్ని కాకరవాయి గ్రామానికి తీసుకురాగా, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, బంధువులు తరలివచ్చి నివాళులర్పించారు. చిన్న వయసులోనే విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
గురుకులాల నిర్వహణపై ప్రశ్నలు
ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాయామం, క్రీడల సమయంలో విద్యార్థులకు అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణ వైద్యం అందించే ఏర్పాట్లు ఉన్నాయా? విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారా? అనే ప్రశ్నలు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరాయి. మరో కుటుంబానికి ఇలాంటి కన్నీటి పరిస్థితి రాకుండా గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
సాత్విక్ కుటుంబానికి ప్రభుత్వ సహాయం
రఘునాథపాలెం మండలంలోని బీసీ గురుకుల పాఠశాలలో మృతి చెందిన కాకరవాయి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి సాత్విక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు స్పందించి మృతుడి కుటుంబానికి రూ.1.20 లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే పొంగులేటి రాఘవ, పీఎస్ఆర్ ట్రస్ట్ తరఫున దహన సంస్కారాల కోసం రూ.10 వేల సహాయం అందించారు. మృతుడు విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ విధానంలోనైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని స్థానిక నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేసి, మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

