కోలాటాలు, నృత్యాలతో సందడిగా గణపతి నిమజ్జన వేడుకలు
గంగవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 20:
గణపతి నవరాత్రుల సందర్భంగా గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల శోభాయాత్రలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథులను గ్రామాల్లో ఊరేగించి నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
కొత్తాడ గ్రామంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తులు గణనాథుడిని సూరంపాలెం రిజర్వాయర్ వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
అదేవిధంగా లక్కొండ, గోరగుమ్మి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను యువతీ యువకులు, భక్తులు కలిసి ఘనంగా ఊరేగించారు. శోభాయాత్రల్లో యువతీ యువకులు కోలాటాలు, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
శోభాయాత్రలు ఆయా గ్రామాల ప్రధాన వీధుల మీదుగా కొనసాగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. అనంతరం గణనాథులను పెద్దేరు వాగు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేపట్టారు.

