17వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య
చీరాల, సెప్టెంబర్ 22 (పెన్ పవర్): కోట్ల బజార్ లక్ష్మీ నాని సమ్మర్ స్పెషల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 17వ వార్షికోత్సవ వినాయక చవితి ఉత్సవాల్లో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక పందిరిలో ప్రతిష్ఠించిన వినాయక స్వామి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తుల కోసం నిర్వహించిన సమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో వినాయక చవితి ఒకటని అన్నారు. భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థిస్తే ఆయన కటాక్షంతో ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

