Homeఆంధ్రప్రదేశ్బాపట్లసీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఉచిత హోమియోపతి మందుల పంపిణీ

పర్చూరు, సెప్టెంబర్ 24, (పెన్ పవర్) : ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ సూచించారు. గురువారం ఉదయం పర్చూరు మండలం ఉప్పుటూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద గ్రామస్తులకు ఉచిత హోమియోపతి నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, విషజ్వరాలు వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని తెలిపారు. ఇళ్ల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూలకుండీల్లో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. దోమల నివారణకు దోమతెరలు ఉపయోగించాలని, నిల్వ ఉంచిన లేదా ఈగలు వాలిన ఆహార పదార్థాలను తీసుకోకుండా, ఇంట్లో తాజాగా వండిన వేడి ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, జలుబు వంటి లక్షణాలు కనిపించినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి, వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని డాక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో నాగలక్ష్మి, స్వచ్ఛంద సేవకురాలు కే. నాగరాజా, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular