– కలశ స్థాపనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు
– రోజుకు 4000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నంలోని శ్రీ శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం ఉదయం 8:55 నిమిషాలకు కలశ స్థాపనతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 21వ తేదీ బుధవారం వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సతీమణి పద్మావతితో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేంద్రరాజు, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ ఎన్. సుజాత, అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖ అధికారిణి కె.ఎల్. సుధారాణి, ఇతర ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్ కు పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో దసరా ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ఈ ఉత్సవాలకు భారత రాష్ట్రపతి కూడా విచ్చేస్తున్నారని తెలిపారు. నర్సీపట్నం ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, 45 ఏళ్ల క్రితం (1983లో) ఈ గుడి నిర్మాణానికి ఎన్నో పోరాటాలు చేశామని ఆయన గుర్తుచేసుకున్నారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి గుడికి దర్శించుకునేందుకు పక్క రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్రల నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని ఆయన అన్నారు . ఆలయ కమిటీ మరియు ప్రజలు కేవలం పూజారులకే బాధ్యతలు వదిలేయకుండా దగ్గరుండి ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రతిరోజూ సుమారు 4 వేల మందికి పైగా భారీ ఎత్తున భోజన సదుపాయం (అన్నదానం) ఏర్పాటు చేశామని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా, దగ్గరుండి వడ్డన తదితర కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. అలాగే, మూలా నక్షత్రం రోజైన 16వ తేదీన సరస్వతీ పూజ సందర్భంగా పిల్లల చదువుల కోసం పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ ఆర్థిక సహాయం కాకుండా తమ వంతు శ్రమదానంతో పాల్గొనాలని ఆయన కోరారు.

