- * కార్డన్ & సెర్చ్ కార్యక్రమం నిర్వహణ.
- * సరియైన పత్రాలులేని 20 వాహనాలు స్వాధీనం.
- * తనిఖీలో సీఐతో పాటు 3 ఎస్సైలు, 30 సిబ్బంది.
- * “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదాలతో భారీర్యాలీ నిర్వహణ.
గుడ్లూరు, పెన్ పవర్, మార్చి 22:
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వేకువజామునే కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు(ఐపీఎస్) ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్సైలు, 30 మంది పోలీసు సిబ్బంది కలిసి గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్టీ కాలనీ మరియు పరిసర ప్రాంతాల్లో ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేసిన తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలతో పాటు పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 20 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని, కొందరికి చలానాలు విధించారు. ఫింగర్ ప్రింట్ పరికరాలతో అనుమానితులను తనిఖీ చేశారు. రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో స్థానిక హైస్కూల్ ప్రాంగణం నుండి బస్టాండ్ కూడలి వరకు భారీర్యాలీ నిర్వహించి, గంజాయి నిర్మూలనకు ప్రజలతో పాటు పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. గుడ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై వి.వెంకట్రావు, వేలేటివారిపాలెం ఎస్సై మరిడి నాయుడు, లింగసముద్రం ఎస్సై జీ.రాంబాబు, పోలీసు సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



