తీవ్ర ఎండల దెబ్బకు ప్రభుత్వ కీలక నిర్ణయం
పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 26
రాష్ట్రాన్ని కమ్మేసిన తీవ్ర ఎండల నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అంగన్వాడీ కేంద్రాలకు హాజరవుతున్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని సిడిపిఓ డి. హేమలత భాస్కర్ తెలిపారు.ఈ మేరకు అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో తాత్కాలిక మార్పులు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు ఎక్కువసేపు ఎండలో ఉండటం ఆరోగ్యపరంగా ప్రమాదకరమని గుర్తించిన ప్రభుత్వం, కేంద్రాల సమయాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే (హాఫ్‌డే) నిర్వహించాల్సి ఉంటుంది.ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చి, మే 31,వరకు కొనసాగనున్నాయి.మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నందున చిన్నారులను ఎక్కువసేపు బయట ఉంచకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు వేడి భోజనం అందించిన వెంటనే ఇంటికి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎండల తీవ్రత కారణంగా హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నందున ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఇక అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మాత్రం పనిలో ఎలాంటి సడలింపు ఉండదని స్పష్టం చేశారు.వారు తమ విధులను యథావిధిగా కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు.ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై పర్యవేక్షణ కోసం ఇంటింటికీ వెళ్లి సేవలు అందించాలని సూచించారు. పోషకాహారం పంపిణీ, ఆరోగ్య సూచనలు, శిశు సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని ఆదేశించారు.ఈ మేరకు జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ అధికారులు, ఐసీడీఎస్ ప్రాజెక్టుల చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు పంపించినట్లు తెలిపారు. ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు ఎక్కడైనా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తల్లిదండ్రులకు కొంత ఊరటనిచ్చేలా ఉందని భావిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే స్థానిక అధికారుల చురుకైన పర్యవేక్షణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అన్ని స్థాయిల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.


