జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్
గంగవరం /రంపచోడవరం, పెన్ పవర్ ఏప్రిల్ 4:
పోలవరం జిల్లాలో భూగర్భ జలాల పునరుజ్జీవనం, నీటి భద్రత సాధనలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ జారీ చేసిన జీవో నెం.10 మేరకు, ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. భూగర్భ జల మట్టాలను పెంపొందించడం, నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఆయన వెల్లడించారు. శాస్త్రీయ విధానాలు, బేసిన్ ఆధారిత ప్రణాళికలు, సమాజ భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.కార్యక్రమాన్ని దశలవారీగా అమలు చేస్తామని పేర్కొంటూ, మొదటి 10 రోజులు కార్యాచరణ గుర్తింపు, తదుపరి 5 రోజులు మంజూరు ప్రక్రియ, 80 రోజులు పనుల అమలు, చివరి 5 రోజులు నివేదికలు, డాక్యుమెంటేషన్ నిర్వహించనున్నట్లు వివరించారు. ఏప్రిల్ 16 నుంచి జూలై 9 వరకు పనులు కొనసాగగా, జూలై 10 నుంచి 14 వరకు నివేదికల ప్రక్రియ చేపడతామని తెలిపారు.
జిల్లాలోని 8 మండలాల్లో 53 సాగునీటి సంఘాలు ఉండగా, ఇప్పటికే 49 సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయని, మిగిలిన 4 సంఘాలకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ సభల ద్వారా నీటి సంరక్షణపై తీర్మానాలు చేయించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేలా కాలువల ద్వారా సమానంగా పంపిణీ జరగాలని, నీటి వృథాను అరికట్టాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో నీటి వనరుల సంరక్షణ, నిర్వహణలో సాగునీటి సంఘాల బాధ్యత మరింత కీలకమని అన్నారు. సాగునీటికి సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఏపీవో జనరల్ డి.ఎన్.వి. రమణ, విబిజి రామ్ జి, ఏపిడి టి. శ్రీనివాస విశ్వనాథ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె. రామ్మోహన్ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి పి. దేవదానం, డీఎల్పీఓ రామకృష్ణ, వ్యవసాయ శాఖ ఏడీఏలు కే. సావిత్రి, హిమబిందు, గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సుబ్బారావు, శివ, ఎస్‌ఎంఐ ఏఈ హరి, ఎస్‌ఓ మార్తమ్మతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

