Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంపార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి: డా. సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్

పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి: డా. సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్

విప్లవ జ్యోతి అల్లూరి 129వ జయంతి వేడుకలు

పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి: డా. సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 04 : మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డా. సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా. జహీర్ అహ్మద్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకుల దురాగతాలను ధైర్యంగా ఎదిరించి సాయుధ పోరాటంతో స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. అల్లూరి పోరాటంతో బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయిందని అన్నారు.

అల్లూరి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయడం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు నామకరణం చేయడం అభినందనీయమని పేర్కొన్న ఆయన, 2002లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ పార్లమెంటు ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇప్పటికీ ప్రతిష్ఠించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. విద్యార్థుల్లో దేశభక్తి, త్యాగనిరతి పెంపొందించేందుకు అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల చరిత్రను పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చి బోధించాలని సూచించారు. కార్యక్రమంలో వివేకానంద సంస్థ అధ్యక్షులు అప్పారావు, సభ్యులు సత్తిబాబు, అప్పలకొండ, టి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular