ePaper
Saturday, May 23, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మార్కాపురంపిడుగుపాటుకు ఇద్దరు మృతి..

పిడుగుపాటుకు ఇద్దరు మృతి..

📰 Generate e-Paper Clip

నలుగురికి తీవ్ర గాయాలు

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్‌ 6

మండలంలో సోమవారం చోటుచేసుకున్న పిడుగుపాటు ఘటనలు రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ దుర్ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అకాల వర్షాలతో కూడిన ఉరుములు, మెరుపులు ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

పొలం పనుల నుంచి వస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతు : మండలంలోని ఎండ్రపల్లి గ్రామంలో మురారిపల్లెకు చెందిన బొందలపాటి చిన్న చెన్నయ్య కుమారుడు నాగయ్య సోమవారం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా అకాలంగా వర్షం మొదలైంది.ఉరుములు, మెరుపులతో వాతావరణం మారిన క్షణాల్లోనే అతడిపై పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన చెన్నయ్యను స్థానికులు వెంటనే యర్రగొండపాలెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో మురారిపల్లె గ్రామంలో విషాదం అలుముకుంది.

ఫ్యాక్టరీలో వలస కార్మికులపై పిడుగు : మండల కేంద్రంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ పరిధిలో జరిగిన మరో ఘటనలో ఐదుగురు వలస కార్మికులు పిడుగుపాటుకు గురయ్యారు. బీహార్ రాష్ట్రానికి చెందిన కన్నయ్య (18) అనే యువకుడు ఈ ఘటనలో మృతి చెందగా, అజిత్ కుమార్, రజినిసు కుమార్, నితీష్ కుమార్, రాజు కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.వీరందరూ బీహార్‌లోని అచరా గ్రామానికి చెందినవారని సమాచారం.సోమవారం మధ్యాహ్నం వరకు సాధారణంగా సాగిన పనులు, ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రమాదకరంగా మారాయి.ఆకాశం మబ్బులతో కమ్ముకుని, ఉరుములు, మెరుపులు తీవ్రరూపం దాల్చాయి. ఈ సమయంలో ఒక్కసారిగా భారీ పిడుగు పడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు నేలకొరిగిపోయారు.ఘటనను చూసిన ఇతర కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఆసుపత్రికి తరలింపు ఒకరు మార్గమధ్యంలో మృతి :  గాయపడిన వారిని వెంటనే యర్రగొండపాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే కన్నయ్య అనే కార్మికుడు ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన నలుగురికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

నిలకడగా నలుగురి పరిస్థితి   : గాయపడిన అజిత్ కుమార్, రజినిసు కుమార్, నితీష్ కుమార్, రాజు కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ, నిరంతరం పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించారు. డాక్టర్ మనోజ్ ఖన్నా నేతృత్వంలోని వైద్య బృందం ప్రత్యేకంగా చికిత్స అందిస్తోంది.

అధికారుల అప్రమత్త సూచనలు : ఈ ఘటనలపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.పుల్లలచెరువు మండలంలో చోటుచేసుకున్న ఈ వరుస పిడుగుపాటు ఘటనలు ప్రజలను కలచివేశాయి. అకాల వర్షాల సమయంలో మెరుపులు, పిడుగులు అధికంగా ఉండే నేపథ్యంలో రైతులు, కార్మికులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ప్రకృతి విరుచుకుపడితే ప్రాణ నష్టం తప్పదనే నిజాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular