ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..!

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..!

📰 Generate e-Paper Clip

పుల్లల చెరువు పెన్ పవర్ మే 20

మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీ పై వినియోగదారుల నుంచి వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడం, బుకింగ్ చేసినప్పటికీ రోజులు గడిచినా సరఫరా జరగకపోవడం, కొంతమంది వినియోగదారులకు అధిక ధరలకు బ్లాక్‌లో సిలిండర్లు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.జిల్లా పౌర సరఫరా అధికారి డి. అంకయ్య, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దారు ఎస్. చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గ్యాస్ గూడెంను తనిఖీ చేసింది.రికార్డుల ప్రకారం గూడెంలో మొత్తం 177 గ్యాస్ సిలిండర్లు ఉండాల్సి ఉండగా, అక్కడ కేవలం 33 సిలిండర్లు మాత్రమే కనిపించాయి. దీంతో మొత్తం 144 సిలిండర్లు స్టాక్‌లో లేకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.స్టాక్ రిజిస్టర్లు, బుకింగ్ వివరాలు, సరఫరా లెక్కలు, వినియోగదారుల డెలివరీ వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డుల్లో ఉన్న వివరాలకు గూడెంలో ఉన్న సిలిండర్ల సంఖ్య సరిపోకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది.తనిఖీల సందర్భంగా పలువురు వినియోగదారులు కూడా అక్కడికి చేరుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.బుకింగ్ చేసిన తర్వాత కూడా పదిరోజులు, పదిహేను రోజులు తిరగాల్సి వస్తోంది,ఫోన్ చేసినా స్పందించడం లేదు, డెలివరీ బాయ్‌లు అదనపు డబ్బులు అడుగుతున్నారు అంటూ పలువురు మహిళలు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.కొందరు వినియోగదారులు సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు కూడా చేశారు.అధికారులు వెంటనే గూడెంను తహశీల్దారు కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓ ఆధీనంలోకి అప్పగించారు. గూడెంలో ఉన్న స్టాక్‌ను పూర్తిగా సీజ్ చేసి, తదుపరి విచారణ కోసం ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.బుధవారం సెల్స్ అధికారి వై. మోహన్‌రావు సమక్షంలో మరోసారి స్టాక్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, భౌతిక నిల్వల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఏజెన్సీపై 6(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే మరిన్ని చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, బ్లాక్ మార్కెటింగ్ లేదా అక్రమ నిల్వలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఎలాంటి అక్రమాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular