- నూతన ఆలయం నిర్మాణంతో గ్రామంలో పండుగ వాతావరణం
కాజులూరు, ఏప్రిల్ 18 ,పెన్‌పవర్:
మండల పరిధిలోని పాతమంజేరు గ్రామంలో గ్రామదేవతగా పూజించబడే గంటాలమ్మతల్లికి నూతన ఆలయం నిర్మించి, ఈ నెల 20వ తేదీన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.పూర్వీకుల కాలం నుంచే పాతమంజేరు గ్రామస్తులు గంటాలమ్మతల్లిని తమ గ్రామదేవతగా కొలుస్తూ వస్తున్నారు. గ్రామానికి రక్షక దేవతగా ఆమెను భావిస్తూ, ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, కరువు, ప్రకృతి విపత్తులు రాకుండా ఉండాలని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తుంటారు.
ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు ప్రత్యేక భక్తిని ప్రదర్శిస్తూ గంటాలమ్మతల్లిని పుణ్యమంతుల వారి ఆడపడుచుగా భావించి, వెండి కిరీటం వంటి కానుకలు సమర్పించేందుకు పోటీ పడటం విశేషంగా నిలుస్తోంది. ఆలయ నిర్మాణంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ పెద్దలు ఎంతో శ్రద్ధతో సహకరించినట్లు తెలిపారు.విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందుగా 18, 19 తేదీలలో ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణులచే వేదమంత్రాల నడుమ గణపతి పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీన ప్రధానంగా గంటాలమ్మతల్లి విగ్రహంతో పాటు గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠ కూడా జరుగనుంది.ఈ మహోత్సవానికి రాజకీయ ప్రముఖులు, నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది.

