డేగల నాగేంద్ర, చుండ్రు వీర్రాజు చౌదరిలకు మంత్రి సుభాష్ ప్రత్యేక అభినందనలు
కాజులూరు, పెన్‌పవర్, మే 28ః కాజులూరు మండలంలోని తర్లంపూడి, కోలంక, గొల్లపాలెం క్లస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమాలు తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. గొల్లపాలెం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న తిరుమల ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడుకు తెలుగు తమ్ముళ్లు భారీగా హాజరై సందడి చేశారు.
టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు), పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చుండ్రు వీర్రాజు చౌదరి సారథ్యంలో మహానాడు వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి హాజరైన కూటమి నాయకులు, కార్యకర్తలకు చుండ్రు వీర్రాజు చౌదరి ఏర్పాటు చేసిన పసందైన తెలుగు విందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పార్టీ సీనియర్ నాయకులు యాళ్ల కృష్ణారావు, దాసరి బాబులు, చందాల ఆదినారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు నక్కా శ్రీను, దడాల నాగార్జున, కోకా హరి, బళ్ల ఈశ్వరరావు, పోతుల వీరబాబు, మండల మహిళా అధ్యక్షురాలు బొమ్మిడి సోమాలమ్మ, అంగర కృష్ణ, తాతబ్బాయి, చందాల మల్లిబాబు, హనుమంతు చౌదరి, నాగమల్లి తదితరుల సమక్షంలో పార్టీ అబ్జర్వర్ ఎం. పద్మావతి పార్టీ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంత్రి సుభాష్ రాకతో మరింత ఉత్సాహం
గురువారం మధ్యాహ్నం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మహానాడు కార్యక్రమానికి హాజరై స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు స్వయంగా తినిపించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రెండు రోజుల పాటు పార్టీ కార్యక్రమానికి తిరుమల ఏసీ ఫంక్షన్ హాల్‌ను ఉచితంగా అందించిన డాక్టర్ డేగల నాగేంద్రను, భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లు చేసిన చుండ్రు వీర్రాజు చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు. మహానాడు విజయవంతానికి కృషి చేసిన గొల్లపాలెం క్లస్టర్-6 ఇన్‌చార్జి పలివెల రాజు, అంగర కృష్ణ, తోట కృష్ణ, హరి, నక్కా శ్రీను, వెంకటరమణ, పితాని సూరసేనుడు, చవ్వాకుల డాక్టర్ బాబులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం తోట త్రిమూర్తులమ్మకు రూ.2 లక్షల చెక్కును మంత్రి అందజేశారు. మండల మహిళా అధ్యక్షురాలు బొమ్మిడి సోమాలమ్మను ఘనంగా సత్కరించగా, క్లస్టర్ ఇన్‌చార్జి పలివెల రాజును సాలువాతో సన్మానించారు. తర్లంపూడి మహానాడు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి సలాది సాయిబాబును కూడా డాక్టర్ బాబు చేతుల మీదుగా సత్కరించారు.
అలాగే కోలంక క్లస్టర్ ఇన్‌చార్జి వనుం వీరబ్రహ్మంను మంత్రి అభినందించారు. అనంతరం తిరుమల ఫంక్షన్ హాల్లోని జిమ్‌ను మంత్రి సందర్శించారు. 
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్, ఖండవల్లి శ్రీనివాసరావు, జ్యోతికుమార్, పిల్లారిశెట్టి రాంబాబు, రంపాల రాజు, బొండా వెంకన్న, బొండా వెంకటనరసింహ నాయుడు, వడ్డాది ధరణి, లకాని కృష్ణచైతన్య, పేపకాయల బాబ్జీ, పెంకే అప్పన్న, రెడ్డి శేషారావు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల అసంతృప్తి చర్చనీయాంశం
ఇదిలా ఉండగా, కార్యక్రమం ముగింపు సమయంలో కొంతమంది పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. “జగన్ వాలంటీర్లను నమ్ముకుని దెబ్బతిన్నాడు… టీడీపీ కూడా అంతా ఆన్‌లైన్, సచివాలయం అంటే కార్యకర్తల పరిస్థితి ఏమిటి?” అంటూ ప్రశ్నించారు.
కార్యకర్తలను విస్మరిస్తే భవిష్యత్తులో పార్టీకి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి కార్యకర్తలను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. దీంతో పార్టీ కార్యక్రమంలోనే కార్యకర్తల అసంతృప్తి బయటపడటం నాయకుల్లో చర్చకు దారితీసింది.

