కాజులూరు, పెన్ పవర్, మే 27ః మండల పరిధిలోని పొలమూరుపాడు గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది పంతగడ అప్పారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడలో సీనియర్ న్యాయవాదిగా ఎన్నో సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ సామాజిక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన ఆయన మృతి పలువురిని కలచివేసింది. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా, దేవాదాయ, ధర్మాదాయ భూములను దళితులకు అంకితం చేయాలని గళమెత్తిన ఉద్యమకారుడిగా పంతగడ అప్పారావు ప్రత్యేక గుర్తింపు పొందారు. “కమ్మరాజ్యంలో గర్జించిన దళిత సింహం”గా పేరుగాంచిన ఆయన సేవలను పలువురు గుర్తు చేసుకున్నారు.
న్యాయస్థానంలో రవిఅస్తమించని సూర్యుడిలా అహర్నిశలు శ్రమిస్తూ, తన వాదనలతో న్యాయదేవతను సైతం మెప్పించిన మహానుభావుడిగా ఆయనను సహచర న్యాయవాదులు స్మరించుకున్నారు. అణగారిన వర్గాలకు అండగా నిలిచి, తాను నమ్మిన ప్రజలకు బ్రతుకుతెరువు చూపించిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.
ఆయన మృతిపై సత్తిబాబు రొక్కాల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్వేగ నివాళులు అర్పించారు. “దివికేగిన ధృవతార… నేడు భూమికే భారమైనడో ఏమో ఈ లోకాన్ని విడిచి నింగికేగిపోయాడు. హృదయాలను కదిలించిన ఆ నాయకుని గొంతు నేడు మూగబోయింది. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పంతగడ అప్పారావు మృతితో సామాజిక ఉద్యమాలకు, న్యాయవాద రంగానికి తీరని లోటు ఏర్పడిందని పలువురు నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

