ఢిల్లీలో ‘సేన గళం’తో పవన్ కొత్త రాజకీయ అజెండా..!
ఢిల్లీలో మూడు రోజుల జనసేన మహాసభలు
జాతీయ వేదికపై ‘సేన గళం’ ఆవిష్కరణ
యువత, రాజ్యాంగ విలువలపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ–కర్ణాటక విస్తరణకు కార్యాచరణ
కుల రాజకీయాలకు ప్రత్యామ్నాయ అజెండా
జాతీయ నేతలతో భేటీలపై ఆసక్తి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావవంతమైన శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల ద్వారా పార్టీ భావజాలాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాచరణ ప్రారంభించారు. ప్రాంతీయ రాజకీయాల పరిధిని దాటి బాధ్యతాయుత రాజకీయ సంస్కృతి, రాజ్యాంగ విలువలు, యువత ఆకాంక్షలను కేంద్రంగా చేసుకుని ‘సేన గళం’ వేదిక ద్వారా కొత్త రాజకీయ చర్చకు శ్రీకారం చుట్టాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటన జనసేన భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా మారనుంది.
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కాకినాడ, జూన్ 12 :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన జనసేన పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ తన ఉనికిని చాటుకునేందుకు అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఈ నెల 14 నుంచి 16 వరకు దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల ద్వారా జనసేన సిద్ధాంతాలు, రాజకీయ దృక్పథం, భవిష్యత్ కార్యాచరణను జాతీయ స్థాయిలో పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన, ఎన్నికల విజయాల తర్వాత తన రాజకీయ విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల పార్టీకి రాజ్యసభ ప్రాతినిధ్యం లభించడం కూడా జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశాలు పార్టీకి కొత్త దిశను చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న అంశం ‘సేన గళం’. సమాజంలో బాధ్యతాయుత రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించడం, కుల ఆధారిత రాజకీయాలకు భిన్నమైన చర్చను ముందుకు తీసుకురావడం, యువతను రాజకీయ ప్రక్రియలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఈ వేదికను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జెన్-జీ తరం ఆలోచనలు, ఆశయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ వంటి అంశాలను ఈ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా చర్చకు తీసుకురావాలని భావిస్తున్నారు.
జనసేనకు చెందిన సుమారు 150 మంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల బాధ్యులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. పార్టీ స్థాపన తర్వాత దేశ రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సమావేశాల్లో పార్టీ బలోపేతం, జాతీయ రాజకీయాల్లో పాత్ర, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు, పొరుగు రాష్ట్రాల్లో విస్తరణ వంటి అంశాలపై విస్తృత చర్చ జరగనుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు పవన్ కల్యాణ్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. దక్షిణ భారత రాష్ట్రాల్లో యువత, మధ్యతరగతి, సామాజికంగా చైతన్యవంతమైన వర్గాలను ఆకర్షించేలా జనసేన భావజాలాన్ని విస్తరించే ప్రయత్నం చేయనున్నారు.పాతకాలపు కుల రాజకీయాలు, వ్యక్తిగత దూషణలతో కూడిన రాజకీయ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా వాస్తవాలు, ప్రజాహితం, బాధ్యతాయుత విమర్శల ఆధారంగా రాజకీయ చర్చ సాగాలని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అదే ఆలోచనను ‘సేన గళం’ ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. మూడు రోజుల సమావేశాల ముగింపు సందర్భంగా పవన్ కల్యాణ్ పలువురు జాతీయ నాయకులతో భేటీ అయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీయే కూటమిలో జనసేన ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు పార్టీ జాతీయ ప్రయాణానికి నాంది పలికే మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపగల రాజకీయ శక్తిగా ఎదగాలన్న జనసేన లక్ష్యానికి ఢిల్లీ సమావేశాలు కీలక వేదికగా మారనున్నాయి.

