హైదరాబాద్‌లో జూన్ 14న తొలి దక్షిణాది నిరసన..
‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా కలకలం..!
విద్యా వ్యవస్థపై యువత గళమెత్తుతోంది..!
సోషల్ మీడియా ఉద్యమం నుంచి వీధి పోరాటాల దాకా
ఐదు రోజుల్లో రెండు కోట్ల ఫాలోవర్లతో సంచలనం
నీట్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనల బాట
హైదరాబాద్ ధర్నా చౌక్‌లో తొలి దక్షిణాది నిరసన
విద్యా వ్యవస్థలో సంస్కరణలే ప్రధాన డిమాండ్
జంతర్ మంతర్ ర్యాలీతో ఉద్యమానికి కీలక ముగింపు ఘట్టం
నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’గా పోల్చిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పుట్టిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు వీధి పోరాటాలకు సిద్ధమైంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల పారదర్శకత, నియామకాలలో జవాబుదారీతనం కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తోంది.
మహారాష్ట్ర నుంచి ప్రారంభమైన ఈ వినూత్న నిరసన ఉద్యమం దక్షిణాదికి చేరుకుంటోంది. జూన్ 14న హైదరాబాద్ ధర్నా చౌక్‌లో జరిగే ఆందోళనపై విద్యార్థి వర్గాలు, యువతలో ఆసక్తి పెరుగుతోంది.
ప్రత్యేక ప్రతినిధి పెన్ పవర్ హైదరాబాద్ జూన్ 12:
కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వ్యంగ్య స్పందనగా ప్రారంభమైన ఈ వేదిక, కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్త యువజన ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం విశేషం. నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’, ‘పరాన్న జీవులు’గా పోల్చిన వ్యాఖ్యలపై వ్యక్తమైన ఆగ్రహం, అసంతృప్తి ఇప్పుడు వ్యవస్థాగత మార్పుల కోసం పోరాటంగా మారుతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏర్పడిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) సోషల్ మీడియాలో అనూహ్య స్పందన పొందింది. ప్రారంభమైన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది మద్దతుదారులను సంపాదించుకున్న ఈ వేదిక, ఐదు రోజుల వ్యవధిలోనే రెండు కోట్లకు పైగా ఫాలోవర్లను చేరుకోవడం దేశవ్యాప్తంగా యువతలో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనంగా భావిస్తున్నారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో ఇటీవల రాజధానిలో నిర్వహించిన నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, పోటీ పరీక్షల నిర్వహణలో లోపాలు, ఫలితాల విడుదలలో జాప్యం, ప్రభుత్వ నియామకాలలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలను ఈ ఉద్యమం ప్రధానంగా ప్రస్తావిస్తోంది. దేశవ్యాప్తంగా నిరసనల శ్రేణిలో భాగంగా జూన్ 14న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటలకు భారీ నిరసన నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో చేపడుతున్న తొలి ప్రధాన ఆందోళనగా దీనిని భావిస్తున్నారు. విద్యార్థి సంఘాలు, ఉద్యోగార్థులు, పౌర సమాజ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అదే రోజు బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో సాయంత్రం మరో భారీ నిరసన నిర్వహించనున్నారు. దక్షిణాదిలో ఉద్యమ విస్తరణకు ఈ రెండు కార్యక్రమాలు నాంది పలుకుతాయని సీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే పుణేలో నిర్వహించిన నిరసనకు మంచి స్పందన లభించగా, లక్నో, అమృత్‌సర్, జైపూర్ నగరాల్లో కూడా ఆందోళనలు కొనసాగనున్నాయి.
విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం, ప్రశ్నపత్రాల లీకేజీలను పూర్తిగా అరికట్టడం, నియామక ప్రక్రియలను వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న సమస్యలపై పాలక వ్యవస్థ స్పందించే వరకు ఉద్యమం కొనసాగుతుందని అభిజీత్ దీప్కే ప్రకటించారు. జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే మహా నిరసనతో ఈ దశ ఉద్యమానికి ముగింపు పలకనున్నారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియా ఆగ్రహం నుంచి వీధి పోరాటాల వరకు ఎదిగిన ఈ ఉద్యమం దేశ రాజకీయాలు, విద్యా వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

