నాలుగు మండలాల నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులు
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువకులు
రెండు గంటల పాటు సాగిన బైక్ ర్యాలీ
నర్సీపట్నం, పెన్ పవర్ :
గత ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండు సంవత్సరాలు అయ్యిందంటూ రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అనకాపల్లిజిల్లా, నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు. సి బి ఎం కాంపౌండ్ నుండి అబీద్ సెంటర్, పాల్గాట్ సెంటర్, శ్రీకన్య జంక్షన్ మీదుగా పెద్దబొడ్డేపల్లి జంక్షన్ వరకు సాగింది. నాలుగు మండలాల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ర్యాలీ ప్రారంభం నుండి చివరి వరకు కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ లో ర్యాలీని ఉద్దేశించి ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో వైయస్ జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నప్పటికీ, చంద్రబాబు మాయమాటలు నమ్మి మరింత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని ఓట్లు వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు, ఇప్పుడు మొఖం చాటేస్తున్నారని అన్నారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు మాటలు విని మోసపోయిన వారందరూ నిలదీయాలని పిలుపునిచ్చారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లు తప్ప ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. వాలంటీర్ల జీతాలు 10 వేలకు పెంచుతానని మాయ మాటలు చెప్పారని, ప్రభుత్వం వచ్చాక ఉన్న వాలంటీర్లను తొలగించారని ఆక్షేపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు మూడుసార్లు పెంచి ప్రజలపై బాదుడే బాదుడు కార్యక్రమం చేశారని ఎద్దేవా చేశారు.

ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 72 కోట్లు, ఆడబిడ్డ నిధి కింద 324 కోట్లు, తల్లికి వందనం కింద 51 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం కింద 84 కోట్లు, కౌలు రైతులకు 25.24 కోట్లు, 50 ఏళ్లకే పెన్షన్ వాగ్దానం ద్వారా 201.50 కోట్లు ఇలా పలు వాగ్దానాల ద్వారా నర్సీపట్నం ప్రజలకు అయ్యన్నపాత్రుడు 700 కోట్లకు పైగా బాకీ ఉన్నారని లెక్కలు చెప్పారు. అమాయక ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అయ్యన్నపాత్రుడులను ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామన్నారు.

రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ తన క్రిమినల్ ఆలోచనలతో వైసిపి నాయకులు పై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని, దానికి వడ్డీతో సహా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో కౌంటింగ్ ముగిసే సమయానికి, నర్సీపట్నంలో టిడిపి నాయకుల కౌంటింగ్ మొదలవుతుందని ఆవేశంగా మాట్లాడారు.

