అవగాహనతోనే గంజాయి, సైబర్ నేరాలకు అడ్డుకట్ట
సైబర్ మోసాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 9: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటేనే సమాజాన్ని సురక్షితంగా ఉంచగలమని గూడెం కొత్తవీధి పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజాయి నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. గంజాయి రవాణా, విక్రయం, వినియోగం చట్టరీత్యా నేరమని, ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.సైబర్ నేరాలపై మాట్లాడుతూ, గుర్తు తెలియని ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. ఆన్లైన్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులకు లేదా సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు వివరించారు.అనంతరం పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా పత్రాలు పరిశీలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 60 శాతం మంది వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండటం సంతోషకరమైన విషయమని, అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని ఎస్సై సురేష్ సూచించారు.ప్రజల సహకారంతోనే గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువత, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

