గిరిజనులకు రూ.200 కోట్ల సబ్సిడీ నిధులు త్వరలో విడుదల
గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డా. బెల్లయ్య నాయక్ తేజావత్
టిక్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ధరావత్‌తో భేటీ

హైదరాబాద్, పెన్ పవర్ జూలై 3 :
గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీ పథకాలు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలపై గిరిజన భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (టిక్కి) వ్యవస్థాపక చైర్మన్ సుధాకర్ ధరావత్ ఆదేశాల మేరకు టిక్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ధరావత్, తెలంగాణ గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ డా. బెల్లయ్య నాయక్ తేజావత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా డా. బెల్లయ్య నాయక్ తేజావత్ మాట్లాడుతూ, గిరిజనులకు అందాల్సిన సబ్సిడీ నిధుల అంశాన్ని మంత్రి స్థాయి వరకు తీసుకెళ్లి చర్చించినట్లు తెలిపారు. రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లో ఈ నిధులకు తగిన ప్రాధాన్యం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ప్రస్తుతం సుమారు రూ.200 కోట్ల మేర సబ్సిడీ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి విడుదల కోసం ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకుంటోందన్నారు. నిధులు విడుదలైన వెంటనే అర్హులైన గిరిజన లబ్ధిదారులకు అందించే ప్రక్రియ వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిక్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ధరావత్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని గిరిజన యువత, పారిశ్రామికవేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు రుణాలు, సబ్సిడీలు, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అనుసంధానం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు టిచ్చి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం, గిరిజన సహకార ఆర్థిక సంస్థ, టిక్కి పరస్పర సమన్వయంతో పనిచేస్తూ మరింత మంది గిరిజన యువతను వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోకి తీసుకురావడమే లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జే. రాంచందర్, ఎం. అశోక్ తదితరులు పాల్గొన్నారు.

