Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంవిశాఖకు తొలి విడతలో 100 ఈ-బస్సులు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విశాఖకు తొలి విడతలో 100 ఈ-బస్సులు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభం

విశాఖకు తొలి విడతలో 100 ఈ-బస్సులు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

 

  బ్యూరో రిపోర్ట్   పెన్ పవర్          విశాఖపట్నం, జూలై 25 : రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో ఏర్పాటు చేసిన పవర్ రూమ్‌ను ఆయన ప్రారంభించి, నిర్మాణంలో ఉన్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజున రాష్ట్రంలో తొలి ఈ-బస్సు పవర్ రూమ్ ప్రారంభం కావడం ప్రజా రవాణా రంగంలో నూతన శకానికి నాంది పలుకుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు.

PM e-Bus Sewa పథకం కింద రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో దశలవారీగా ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం సంస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలి ఈ-బస్సు డిపోగా సింహపురి డిపో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. సెప్టెంబర్ నాటికి తొలి విడతగా 30 ఎలక్ట్రిక్ బస్సులు డిపోకు చేరనున్నాయని, దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఏపీఎస్‌ఆర్టీసీ జోన్-1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ డిపో ఏర్పాటులో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అధికారులు సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేస్తున్నారని అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎం. సుధాబిందు, కె. పద్మావతి, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ ఏ. గంగాధర్ రావు, డిపో మేనేజర్ హెచ్. హనుమశ్రీ, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) కొండలరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు అచ్యుతనాయుడు, సిమ్మన్న, యూనియన్ ప్రతినిధులు, అధికారులు, ఇంజినీర్లు, సూపర్వైజర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం డిపో కమిటీలు, కార్మిక సంఘాల ప్రతినిధులు మంత్రిని ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular