అల్లూరి 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
145 మంది కళాకారులతో 35 సాంస్కృతిక ప్రదర్శనలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 4 : మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు శనివారం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గురజాడ సాంస్కృతిక వేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏసీపీ కె. సత్యనారాయణ, ఇంటర్నేషనల్ వాకర్స్–101 డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేష్, అల్లూరి విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కోశాధికారి వి.ఎస్. పద్మనాభరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఏసీపీ కె. సత్యనారాయణ మాట్లాడుతూ, గిరిజనులపై బ్రిటీష్ పాలకులు అమలు చేసిన రిజర్వ్ ఫారెస్ట్ చట్టం వల్ల జరిగిన అన్యాయాలను ఎదుర్కొనేందుకు అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటాన్ని చేపట్టారని చెప్పారు. కేవలం 27 ఏళ్ల వయస్సులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుడని కొనియాడారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వాకర్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేష్ మాట్లాడుతూ, అల్లూరి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ట్రస్ట్ కోశాధికారి వి.ఎస్. పద్మనాభరాజు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాలు గడిచినా గిరిజనులు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి హక్కుల పరిరక్షణకు సమాజం బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. జి.ఎస్. రాజేశ్వరరావు మాట్లాడుతూ, విశాఖపట్నంతో అల్లూరికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఆయన త్యాగస్ఫూర్తి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.
అనంతరం జాతీయ భావాలు, అల్లూరి జీవితం, స్వాతంత్ర్య ఉద్యమం, తెలుగు భాష ఔన్నత్యం, మూఢాచారాల నిర్మూలన వంటి అంశాలపై వివిధ డ్యాన్స్ అకాడమీలు, కళాసంస్థలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రజానాట్యమండలి ప్రదర్శించిన “వైజాగ్ గోవా” లఘునాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం 145 మంది కళాకారులు 35 కళారూపాలను ప్రదర్శించగా, పాల్గొన్న వారందరికీ పతకాలు, డ్యాన్స్ అకాడమీలకు జ్ఞాపికలు అందజేశారు. గురజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శి దండు నాగేశ్వరరావు పర్యవేక్షణలో అధ్యక్షుడు పి.వి. రమణ, కోశాధికారి ఆర్.ఎస్.ఆర్. మూర్తి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. చివరగా ఆర్.ఎస్.ఆర్. మూర్తి వందన సమర్పణతో సభ ముగిసింది.

