బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 4: విశాఖపట్నంలోని గాంబీరం గెడ్డ రిజర్వాయర్ వేదికగా నిర్వహిస్తున్న అష్మిత సౌత్ జోన్ కనోయింగ్–కాయకింగ్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు పాల్గొనడంతో క్రీడా ప్రాంగణం సందడిగా మారింది. పోటీలను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మాథుకుమిల్లి శ్రీభరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) చైర్మన్ అనిమిని రవి నాయుడు, డైరెక్టర్లు రాజా ఎం.డి., బుచ్చి రాజు, డీఎస్‌డీఓ జూన్, ఆంధ్రప్రదేశ్ కనోయింగ్–కాయకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన, క్రీడాకారుల పరేడ్, ప్రమాణ స్వీకారం అనంతరం పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ క్రీడాకారులతో ముచ్చటించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నీటి క్రీడల అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని SAAP చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు.మొదటి రోజు నిర్వహించిన కాయకింగ్ 1000 మీటర్ల పోటీల్లో K4 విభాగంలో కర్ణాటక ప్రథమ స్థానం, తెలంగాణ ద్వితీయ స్థానం, కేరళ తృతీయ స్థానం సాధించాయి. K2 విభాగంలో ఒడిశా తొలి స్థానం, మధ్యప్రదేశ్ రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. K1 విభాగంలో కర్ణాటక విజేతగా నిలవగా, ఒడిశా ద్వితీయ, తెలంగాణ తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు అతిథులు అభినందనలు తెలిపారు.
మిగిలిన 500 మీటర్లు, 200 మీటర్లతో పాటు ఇతర విభాగాల పోటీలు కూడా ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కనోయింగ్–కాయకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. బలరాం నాయుడు తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 350 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు, సాంకేతిక అధికారులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం విశాఖపట్నానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

