✒️
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ముందుగానే పంపిణీ
వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 30:
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్లె రామాంజనేయులు గురువారం పాల్గొన్నారు.
జీవీఎంసీ 95వ వార్డు వేపగుంట మెయిన్ రోడ్ ఎస్సై కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పింఛన్లు అందజేశారు. వృద్ధులు, వికలాంగులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకుని, స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, శని, ఆదివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉండటంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెండు రోజుల ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగుల సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జీవీఎంసీ పెందుర్తి జోన్ జోనల్ కమిషనర్ శంకర్రావు, ఏపీడీ గంగాధర్, మాజీ కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, జనసేన–టీడీపీ–బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

