బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జులై 04 : విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా సీపీఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం బీచ్ రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎస్.కే. రహిమాన్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న పాలకుల చర్యలను అల్లూరి స్ఫూర్తితో ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని అన్నారు.
అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో జన్మించి, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం వారిలో చైతన్యం నింపి ఉద్యమానికి నాయకత్వం వహించారని, దేశ స్వాతంత్ర్యం కోసం అల్ప వయస్సులోనే ప్రాణత్యాగం చేశారని కొనియాడారు.ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి కార్పొరేట్ వర్గాల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా వందల ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం ప్రజా వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పి. చంద్రశేఖర్, జిల్లా సమితి సభ్యులు సీహెచ్. కాసుబాబు, కొమర సందీప్ కుమార్, కె. లక్ష్మణరావు, కాసుల్ రెడ్డి, టీ. వెంకటేశ్వరరావు, మీసాల శ్రీనివాసరావు, నాగు, శ్రీనివాసరావు, రమణ (ఆటో డ్రైవర్) తదితరులు పాల్గొన్నారు.

