విమ్స్‌లో 50 కిలోవాట్ల ఆన్-గ్రిడ్ రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 25 : విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో 50 కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆన్-గ్రిడ్ రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు ఆర్సెలర్ మిట్టల్ నిప్పోన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AM/NS India) తమ కార్పొరేట్ ఎన్విరాన్‌మెంటల్ రెస్పాన్సిబిలిటీ (CER) నిధుల ద్వారా ఆర్థిక సహకారం అందించింది.
జిల్లా కలెక్టర్ ప్రోత్సాహంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వి. మురళీధర్, ఎఎంఎన్‌ఎస్ ఇండియా ప్రతినిధి డాక్టర్ టీ.ఎం. రవీంద్రనాథ్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వి. మురళీధర్ మాట్లాడుతూ, సోలార్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి సుమారు 6 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దీంతో ప్రతి నెలా సుమారు రూ.50 వేల వరకు విద్యుత్ బిల్లుల భారం తగ్గనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆసుపత్రిలో 220 కిలోవాట్ల సోలార్ వ్యవస్థ అందుబాటులో ఉండగా, కొత్తగా 50 కిలోవాట్లు జత కావడంతో మొత్తం సామర్థ్యం 270 కిలోవాట్లకు చేరిందన్నారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా ఉపయోగపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలకు కార్పొరేట్ సంస్థలు CER నిధుల ద్వారా మరింత సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో విమ్స్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) శ్రీనివాస్ కుమార్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డా. మనోజ్ కుమార్, ఎఎంఎన్‌ఎస్ ఇండియా ప్రతినిధులు, ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

