నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డెత్ సర్టిఫికెట్‌కు కదిలిన యంత్రాంగం
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి చొరవతో అధికారుల చర్యలు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం జులై 25 : 2021లో తుఫాన్‌లో మృతి చెందిన తన భర్తకు నాలుగేళ్లుగా డెత్ సర్టిఫికెట్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళ సమస్యకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చొరవతో పరిష్కార మార్గం ఏర్పడింది. సంబంధిత అధికారులతో మాట్లాడిన అనంతరం డెత్ సర్టిఫికెట్ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించడంతో అధికారులు ఫైల్‌ను ప్రాసెస్ చేస్తున్నట్లు తెలిపారు.
దక్షిణ నియోజకవర్గం 38వ వార్డుకు చెందిన సూరాడ నాగమణి భర్త సూరాడ చిట్టిబాబు 2021లో తుఫాన్‌లో మృతి చెందారు. అనంతరం ప్రభుత్వ పథకాలు, పరిహారం పొందేందుకు అవసరమైన డెత్ సర్టిఫికెట్ కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌ను ఆశ్రయించారు.
బాధితురాలి వినతిపై స్పందించిన వాసుపల్లి గణేష్ కుమార్ సంబంధిత జేడీ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో చర్చించారు. అనంతరం సీహెచ్‌ఎంఓ కార్యాలయంతో మాట్లాడి డెత్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, పేద ప్రజలు చిన్న చిన్న ధ్రువపత్రాల కోసం సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా కృషి చేస్తానని అన్నారు.
తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మాజీ ఎమ్మెల్యేకు సూరాడ నాగమణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

