Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంభోగాపురం విమానాశ్రయంపై ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపుతోందని, సింహాచలం గిరిప్రదక్షిణను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు

భోగాపురం విమానాశ్రయంపై ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపుతోందని, సింహాచలం గిరిప్రదక్షిణను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు

 

గిరిప్రదక్షిణ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది:

వాసుపల్లి గణేష్ కుమార్

భోగాపురం విమానాశ్రయంపై ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపుతోందని, సింహాచలం గిరిప్రదక్షిణను నిర్లక్ష్యం చేసిందని విమర్శలు

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31 : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఆసీలమెట్టలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంపై ప్రభుత్వం నెల రోజులుగా ప్రత్యేక దృష్టి పెట్టినా, లక్షలాది మంది భక్తులు పాల్గొనే గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించకపోవడం విచారకరమన్నారు.

హోంమంత్రి ముందుగానే 10 లక్షల మంది భక్తులు వస్తారని ప్రకటించినప్పటికీ, దానికి తగిన ట్రాఫిక్, భద్రతా, రవాణా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ట్రాఫిక్ జామ్‌లలో భక్తులు, అంబులెన్సులు గంటల తరబడి చిక్కుకుపోయాయని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. గిరిప్రదక్షిణ సజావుగా సాగకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిప్రదక్షిణ నిర్వహణలో జరిగిన లోపాలపై స్పందించకపోవడాన్ని కూడా వాసుపల్లి ప్రశ్నించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన భూములను డేటా సెంటర్ కోసం వినియోగిస్తున్నారని, కొండలను తవ్వి భక్తులకు కనిపించకుండా గ్రీన్ మ్యాట్లతో కప్పివేశారని ఆరోపించారు. డేటా సెంటర్ కారణంగా భవిష్యత్తులో నీటి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

భోగాపురం విమానాశ్రయంపై కూడా విమర్శలు

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంపై ప్రభుత్వం అధిక ప్రచారం చేసుకుంటోందని, విమానాశ్రయ నిర్మాణంలో అధిక భాగం గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిందని వాసుపల్లి పేర్కొన్నారు. 70 శాతం పనులు అప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం కేవలం చివరి దశ పనులకు మాత్రమే కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని విమర్శించారు.

విశాఖపట్నం విమానాశ్రయాన్ని పక్కనబెట్టి భోగాపురానికి తరలించే నిర్ణయంపై ప్రజాభిప్రాయం తీసుకోలేదని, దీనివల్ల ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వేల ఎకరాల భూమిని జీఎంఆర్‌కు కేటాయించారని ఆరోపిస్తూ, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని నారా లోకేష్‌కు సవాల్ విసిరారు.

ఈ మీడియా సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, దక్షిణ నియోజకవర్గ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular