Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: బొత్స సత్యనారాయణ

ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: బొత్స సత్యనారాయణ

✒️

 

 

ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: బొత్స సత్యనారాయణ

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, జూలై 31 : రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

విశాఖపట్నంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై నమోదు చేసిన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్లినా ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు.

శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు వద్ద తన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం అవమానకరమని బొత్స అన్నారు. తాను ముందుగానే పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చినా ఈ విధంగా వ్యవహరించారని, ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరినీ బెదిరించలేదని, కొందరు మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు “జై జగన్” అంటూ నినాదాలు చేయడాన్ని వక్రీకరించి మహిళా ఎస్‌ఐపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దుర్మార్గమని బొత్స విమర్శించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం నేరం కాదని, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారని, అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వం భూసేకరణ, పునరావాసం, కీలక అనుమతులు, మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసి దాదాపు పూర్తి చేసిందని బొత్స పేర్కొన్నారు. మొత్తం ఘనతను ప్రస్తుత ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం చరిత్రను వక్రీకరించడమేనని విమర్శించారు. ప్రధానమంత్రి పర్యటనను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చవద్దని సూచించారు.

డీఎస్సీ నియామకాల విషయంలో ప్రభుత్వం నిబంధనలను మార్చి కొందరికి అనుకూలంగా వ్యవహరించిందని బొత్స ఆరోపించారు. జీవో 447 ద్వారా నిబంధనలను సవరించి నియామకాలు చేపట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జీవో ఎందుకు మార్చాల్సి వచ్చిందో, ఎవరికి ప్రయోజనం కలిగిందో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, పార్టీ నాయకులు తిప్పల శ్రీనివాస్, దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular