Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంసింహాచలం గిరి ప్రదక్షిణలో ఘోర వైఫల్యం.. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు

సింహాచలం గిరి ప్రదక్షిణలో ఘోర వైఫల్యం.. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు

 

సింహాచలం గిరి ప్రదక్షిణలో ఘోర వైఫల్యం.. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు

 

  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        విశాఖపట్నం, జూలై 29 :
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, శాఖల మధ్య సమన్వయ లోపంతో లక్షలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే.కే. రాజు ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేవాదాయ, పోలీసు, రెవెన్యూ, జీవీఎంసీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా అందలేదని ఆయన విమర్శించారు. గిరి ప్రదక్షిణకు సంబంధించిన ట్రాఫిక్ ఆంక్షలు, ఇతర ఏర్పాట్లపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో భక్తులు, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకే పరిమితమై, భక్తుల రద్దీని అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

గిరి ప్రదక్షిణ శతాబ్దాలుగా కొనసాగుతున్న పవిత్ర సంప్రదాయమని, అయితే “తొలి పావంచా” విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు భక్తుల్లో గందరగోళానికి దారితీశాయని కే.కే. రాజు అన్నారు. సంప్రదాయాలను మార్చే అధికారం రాజకీయ నాయకులకు కాదని, ఆలయ ఆగమ పండితుల సూచనల మేరకే నిర్ణయాలు ఉండాలని వ్యాఖ్యానించారు.

దేవాదాయ శాఖ మంత్రి కార్యక్రమంపై స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించిన ఆయన, సింహాచలం ఆలయానికి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్వామివారి భూముల కేటాయింపులపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో జీవీఎంసీ పూర్తిగా విఫలమైందని కే.కే. రాజు అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సేవలందించడంతోనే పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చిందని పేర్కొన్నారు.

గిరి ప్రదక్షిణ నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ తరఫున కే.కే. రాజు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular