Homeతెలంగాణఖమ్మంవర్షంలోనే వార్డుల బాట పట్టిన మంత్రి పొంగులేటి

వర్షంలోనే వార్డుల బాట పట్టిన మంత్రి పొంగులేటి

 

ఏదులాపురంలో క్షేత్రస్థాయి పర్యటన.. ప్రజల సమస్యలపై నేరుగా ఆరా

రూ.100 కోట్ల నిధులతో మోడల్ మున్సిపాలిటీగా ఏదులాపురం రూపకల్పన

ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 7:

వర్షం కురుస్తున్నా వెనుకడుగు వేయలేదు. గొడుగు పట్టుకుని నేరుగా ప్రజల్లోకి వెళ్లారు. వార్డుల వీధుల్లో కాలినడకన పర్యటిస్తూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌తో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, ఇందిరమ్మ కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, వర్షపు నీటి పారుదల వంటి సమస్యలను ప్రజలు నేరుగా మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటన మధ్యలో సాయిగణేష్ నగర్‌లోని ఓ టీ దుకాణం వద్ద మంత్రి ఆగి స్థానికులతో కలిసి టీ తాగుతూ వారి సమస్యలను తెలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలతో ఆప్యాయంగా మమేకమై వారి ఇబ్బందులను ఓపికగా విన్న మంత్రి, అభివృద్ధి పనుల్లో రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఏదులాపురం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఈ నిధులతో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా మెరుగుదల, లోతట్టు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, తుమ్మ చెట్ల తొలగింపు వంటి పనులను చేపట్టి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా ఏదులాపురాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలకు సంబంధించిన అర్హుల దరఖాస్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని తెలిపారు. మున్సిపాలిటీలో కొనసాగుతున్న పార్కుల అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular