సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి: మల్ రెడ్డి రాంరెడ్డి
ఎల్బీనగర్ లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఎల్బీనగర్, పెన్ పవర్, అక్టోబర్ 6:
సీఎం రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేద ప్రజల అభివృద్దే ఏకైక ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో చేపట్టారు. కార్యక్రమానికి గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మల్ రెడ్డి రాంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు మరింత సులభమైన, పారదర్శకమైన రేషన్ సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభించారని గుర్తు చేశారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్ సేవలు మరింత సులభంగా అందడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం, ప్రజల ఆత్మగౌరవం, ప్రతి కుటుంబానికి భరోసా అనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి భరోసాగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మెగావత్ గణేష్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, మైనారిటీ సీనియర్ నాయకులు జానిమియా, నాయకులు అజయ్, కాలనీ వాసులు పెంటారెడ్డి, అధిక సంఖ్యలో లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.

