Homeఆంధ్రప్రదేశ్కాకినాడసీఎంను కలిసిన పిల్లి దంపతులు.. నియోజకవర్గ సమస్యలపై వినతి

సీఎంను కలిసిన పిల్లి దంపతులు.. నియోజకవర్గ సమస్యలపై వినతి

కాకినాడ రూరల్, పెన్ పవర్ అక్టోబర్ 6: కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రాలు సమర్పించినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి,పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు తెలిపారు. మంగళవారం విజయవాడ సచివాలయంలో సీఎంను కలిసి నియోజకవర్గంలోని వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) దరఖాస్తులను సీఎంకు అందజేసి, వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థికసాయం అందించాలని కోరినట్లు తెలిపారు. కరప మండలం వేళంగి గ్రామానికి చెందిన తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఇప్పటికే రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరైందని, కుటుంబ సభ్యులు చికిత్స కోసం సుమారు రూ.60 లక్షలు ఖర్చు చేసిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబునాయుడు మానవతా దృక్పథంతో మరో రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.అలాగే నియోజకవర్గంలో పాముకాటుతో మృతి చెందిన వ్యక్తి కుటుంబ పరిస్థితిని సీఎంకు వివరించి ఆర్థికసాయం కోరగా, రూ.2 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో కేసులో అవసరమైన పత్రాలు సమర్పించలేక సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తు తిరస్కరణకు గురైన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. గడువు దాటిన అనంతరం రిటర్న్‌ అయిన ఫైల్‌ పరిస్థితిని వివరించగా, అర్హత మేరకు 40 శాతం ఆర్థికసాయం అందించేందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

కాకినాడ రూరల్, కరప మండలాల్లో ఆలయాల నిర్మాణం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరగా, సంబంధిత నిధులు మంజూరు చేసేలా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు పిల్లి దంపతులు తెలిపారు. అదేవిధంగా బీసీ వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి, వైద్యసాయం, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థికసాయం మంజూరు చేయడంతో పాటు అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినందుకు పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular