Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లివరి పంట వేసిన రైతులందరూ భీమా చేయించుకోండి

వరి పంట వేసిన రైతులందరూ భీమా చేయించుకోండి

వరి పంట బీమా పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక సూచనలు

క్షేత్రస్థాయిలో రైతులకు చెప్పి పంట బీమా చేయించాలని నాయకులకు పిలుపు

నర్సీపట్నం, పెన్ పవర్ :

​ఈ ఏడాది ఎల్ నీనో వాతావరణ ప్రభావం వల్ల వర్షాలు సరిగ్గా కురవక వరి పంటకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి వరి సాగు చేసే రైతులందరూ తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకే ఈ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు ఆగస్టు 15వ తేదీ లోపు ఎకరానికి కేవలం రూ. 84 చెల్లించి తమ వరి పంటకు ఇన్సూరెన్స్ నమోదు చేసుకోవాలని కోరారు. రైతుల సౌకర్యార్థం కామన్ సర్వీస్ సెంటర్లు (CSC), ఆధార్ అప్‌డేట్ సెంటర్లతో పాటు సమీపంలోని గ్రామ సచివాలయాల్లో కూడా ఈ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. రైతులు తమ 1B పత్రం, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్, సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికెట్, కౌలు రైతులైతే కౌలు ఒప్పంద పత్రం లేదా గ్రామ సర్పంచ్ లేదా విఆర్ఓ ధృవీకరణ పత్రం మరియు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో (ఓటీపీ కోసం) సచివాలయం లేదా సీఎస్సీ సెంటర్‌కు వెళ్లాలని తెలిపారు. నాట్లు పూర్తయిన 15 నుండి 30 రోజులలోపు తప్పనిసరిగా ‘e-పంట’ లో వివరాలు నమోదు చేయించుకోవాలని, అలా చేసిన వారికి ఎకరానికి రూ. 42,400 వరకు బీమా పరిహారం అందుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మండల స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఆయన పిలుపునిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఈ పంట బీమాపై పూర్తి అవగాహన కల్పించి, వారిచేత ఇన్సూరెన్స్ కట్టించే బాధ్యతను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ అవకాశాన్ని కేవలం వరి పంట వేసిన ప్రతి ఒక్క రైతు వినియోగించుకుని, తమ పంటలకు రక్షణ కల్పించుకోవాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular