పోలవరం జిల్లా బీజేపీ డిమాండ్
గంగవరం పెన్ పవర్, ఆగస్టు 24: పోలవరం జిల్లాలో సస్పెన్షన్కు గురైన 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని పోలవరం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సస్పెన్షన్ కాలం ముగిసి ఎనిమిది నెలలు గడిచినా ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం అన్యాయమని పేర్కొంది.
2018–19 ఆర్థిక సంవత్సరంలో పోలవరం జిల్లాలోని 11 మండలాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని బీజేపీ తెలిపింది. ఈ పనులకు సంబంధించిన పరిపాలనా, ఆర్థిక వ్యవహారాలను పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాల్సి ఉండగా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్కు చెందిన 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లకు జియో ట్యాగింగ్ బాధ్యతలు అప్పగించారని పేర్కొంది.
తమ శాఖకు సంబంధం లేని పనిగా జియో ట్యాగింగ్ చేయలేమని వారు అధికారులకు తెలిపినప్పటికీ ఒత్తిడి తీసుకువచ్చి మొదటి దశ జియో ట్యాగింగ్ చేయించారని ఆరోపించింది. అనంతరం సంబంధిత యాప్ను ఇతరులకు అప్పగించి, పనులు పూర్తికాకపోయినా పూర్తయినట్లుగా జియో ట్యాగింగ్ చేసి సుమారు రూ.1.78 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయని తెలిపింది.
ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించగా సుమారు 60 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు బీజేపీ పేర్కొంది. అక్రమాలు జరిగినట్లు, కొంతమంది ఎంపీడీఓలు ప్రధాన బాధ్యత వహించినట్లు, నిధులు ఏ ఖాతాలకు ఎంత మొత్తంలో వెళ్లాయన్న వివరాలు నివేదికలో ఉన్నాయని తెలిపింది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని కూడా సూచించినట్లు పేర్కొంది.
అయితే ఆర్థిక లావాదేవీలతో ప్రత్యక్ష సంబంధం లేని 24 మంది కిందిస్థాయి ఉద్యోగులపై మాత్రమే కఠిన చర్యలు తీసుకుని ఆరు నెలలపాటు సస్పెండ్ చేయడం అన్యాయమని బీజేపీ ఆక్షేపించింది. సస్పెన్షన్ కాలం పూర్తయినప్పటికీ విధుల్లోకి తీసుకోకపోవడంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది.
కుంభకోణానికి బాధ్యులుగా విచారణలో తేలిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి ఉద్యోగులను మాత్రమే శిక్షించడం కక్షసాధింపు చర్యగా కనిపిస్తోందని బీజేపీ పేర్కొంది.
ప్రభుత్వం తక్షణమే స్పందించి 22 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని, సస్పెన్షన్ కాలానికి సంబంధించిన జీతభత్యాలను నిబంధనల ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేసింది. విజిలెన్స్ నివేదికలో బాధ్యులుగా పేర్కొన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు దుర్వినియోగమైన ప్రభుత్వ నిధులను పూర్తిగా రికవరీ చేయాలని కోరింది.
కుంభకోణంతో సంబంధం లేని ఉద్యోగులపై విధించిన చర్యలను పునఃసమీక్షించి వారికి న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అవసరమైతే బాధిత ఉద్యోగుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేసింది.

