ప్రజల్లో నేరాల నివారణపై విశాఖ పోలీసుల అవగాహన కార్యక్రమం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 1: నగరంలో నేరాల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ విశాఖపట్నం నగర పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు, డీసీపీ (క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి, ఏసీపీ (క్రైమ్స్) శ్రీ వెంకట్రావు పర్యవేక్షణలో సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జీ.డి. బాబు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, దువ్వాడ, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన బస్ స్టాప్‌లు, బస్సుల్లో ప్రయాణించే ప్రజలు, విద్యార్థులు, మహిళలకు శుక్రవారం నేరాల నివారణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బస్సుల్లో రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు అపహరించే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కిటికీ పక్కన కూర్చొని ప్రయాణించే మహిళలు బంగారు గొలుసులు, ఆభరణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, గొలుసు లాక్కునే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అదేవిధంగా, మాయమాటలు చెప్పి దృష్టి మళ్లించే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను నమ్మి నగదు లేదా విలువైన వస్తువులు అప్పగించవద్దని సూచించారు. ఇంట్లో అధిక మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు నిల్వ ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని అవగాహన కల్పించారు.
ద్విచక్ర వాహనాలకు స్టీరింగ్ లాక్‌తో పాటు అదనపు సేఫ్టీ లాక్‌లు ఏర్పాటు చేసుకోవాలని, ఇళ్ల తలుపులు, కిటికీలకు పటిష్టమైన తాళాలు అమర్చాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు రాంబాబు, విజయకుమార్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

