Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంగోదావరి వరదలపై ప్రభుత్వం అప్రమత్తం

గోదావరి వరదలపై ప్రభుత్వం అప్రమత్తం

గోదావరి వరదలపై ప్రభుత్వం అప్రమత్తం

ప్రభావిత జిల్లాల్లో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు – లంక గ్రామాల ప్రజలను ముందస్తు తరలింపునకు ఆదేశాలు

  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         అమరావతి, జూలై 31: గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఉన్నతాధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని హోంమంత్రి ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లా, మండలాల్లో 24 గంటలూ పనిచేసే అత్యవసర కంట్రోల్ రూమ్‌లను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు.

గోదావరి ముంపునకు గురయ్యే లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీరు, నాణ్యమైన ఆహారం, పాలు, అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గోదావరి వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు నదిలో స్నానాలు చేయడం, చేపల వేటకు వెళ్లడం, సెల్ఫీల కోసం వరద నీటి వద్దకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 1800 425 0101కు సంప్రదించాలని హోంమంత్రి అనిత సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular