Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి కొత్త దిశ: మంత్రి కందుల దుర్గేష్

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి కొత్త దిశ: మంత్రి కందుల దుర్గేష్

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి కొత్త దిశ: మంత్రి కందుల దుర్గేష్

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్   విశాఖపట్నం, జులై 31 : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో నిర్వహించిన “కర్టెన్ రైజర్” కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని, పర్యాటకం, పరిశ్రమలు, రవాణా అనుసంధానత పెరగడంతో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” అనే పేరు పెట్టడం ప్రజల ఆశయాలకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

విమానాశ్రయం నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “థాంక్స్ ఫార్మర్స్” అనే సందేశంతో రూపొందించిన సైకత శిల్పం అభినందనీయమని కొనియాడారు. అలాగే భోగాపురం విమానాశ్రయ నమూనాతో రూపొందించిన ఇసుక శిల్పం, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక సెల్ఫీ పాయింట్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ పరిశుభ్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను బీచ్‌లో వేయకుండా పర్యాటకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీచ్ వద్ద జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా కాపాడుతుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో అన్నమాచార్య ట్రస్ట్ చిన్నారుల నృత్య ప్రదర్శనలు, గిరిజన కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంప్రదాయ కోలాటంతో మంత్రికి మహిళలు స్వాగతం పలికారు. అనంతరం “ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. మన ఎయిర్‌పోర్ట్ – మన భవిష్యత్” పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను సందర్శించిన మంత్రి సిగ్నేచర్ వాల్‌పై తెలుగులో సంతకం చేశారు.

భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, టూరిజం అండ్ ట్రావెల్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ మోహన్, హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తీక్, పర్యాటక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో పర్యాటకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular