Homeఆంధ్రప్రదేశ్బాపట్లఏపీ మోడల్‌ స్కూల్‌ ఎస్ఎంసీ ఎన్నికలపై వివాదం

ఏపీ మోడల్‌ స్కూల్‌ ఎస్ఎంసీ ఎన్నికలపై వివాదం

నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక జరిగిందని కొందరు తల్లిదండ్రుల ఆరోపణలు

సీసీ ఫుటేజ్‌ పరిశీలించి సమగ్ర విచారణ చేయాలని డిమాండ్‌

చీరాల, సెప్టెంబర్‌ 29 :

చీరాల ఏపీ మోడల్‌ స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు వివాదానికి దారితీశాయి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు జరగలేదని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో పాఠశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, కుకింగ్‌ విభాగం, ఇతర సిబ్బందిపై పలు ఆరోపణలు, కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలపై మరింత చర్చ జరుగుతోంది.

ఎస్ఎంసీ ఎన్నికల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించినప్పటికీ, పలువురు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకునేలోపే కొందరు సిబ్బందికి అనుకూలంగా ఉన్న వ్యక్తుల పేర్లను నమోదు చేసి ఎన్నిక పూర్తయిందని ప్రకటించారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగిందా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారి స్వయంగా పాఠశాలను పరిశీలించి సీసీ ఫుటేజ్‌ను పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఎంతమంది తల్లిదండ్రులు హాజరయ్యారు? ఎవరెవరు ఎన్నికల్లో పాల్గొన్నారు? కో-ఆప్షన్‌ సభ్యులుగా ఎంపికైన వారు నిబంధనల ప్రకారం అర్హులేనా? తదితర అంశాలపై సమగ్రంగా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు పేర్కొంటున్నారు.

ఎస్ఎంసీ ఎన్నికలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి ఎన్నికల ప్రక్రియపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు. తాజా పరిణామాలతో చీరాల ఏపీ మోడల్‌ స్కూల్‌ మరోసారి వివాదానికి కేంద్రంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular