అంబేడ్కర్ ఆశయాలను నేటి తరానికి చేరువ చేయాలి
కాజులూరు, పెన్‌పవర్, సెప్టెంబర్ 13:
కాజులూరు మండల పరిధిలోని కాజులూరు అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఆదివారం చిన్నారులచే బుద్ధపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం త్రిరత్న బుద్ధవిహార్‌లో శ్రీ భీమ్‌రావ్ రాంజీ ప్రజాసంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, పూర్వ సంఘం పెద్దలు, సభ్యులు సమావేశమయ్యారు.సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా సంఘ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి సభ్యులు తమ సూచనలు, సలహాలు అందించాలని సమావేశంలో సూచించారు. మండలంలోని గ్రామాల్లో ప్రతి నెల డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనా విధానం, బుద్ధ భగవానుడి బోధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర, ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేసేలా కమిటీ సభ్యులు కృషి చేయాలని పలువురు సూచించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కేవలం బడుగు, బలహీన వర్గాల నాయకుడు మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ మార్గదర్శకుడని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన అంబేడ్కర్ భారత తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారని గుర్తుచేశారు. విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమ నేతగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో సమానత్వం నెలకొనాలంటే కుల వివక్ష నిర్మూలన అవసరమని అంబేడ్కర్ పోరాడారని తెలిపారు.అంబేడ్కర్‌పై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సమావేశంలో సభ్యులు తీవ్రంగా ఖండించారు. అంబేడ్కర్ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు, ప్రచారాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హమారా ప్రసాద్ చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ గౌరవాన్ని కించపరిచే చర్యలను ఖండిస్తూ సభ్యులు నినాదాలు చేశారు.అంబేడ్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సమానత్వ భావనను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో పలువురు పేర్కొన్నారు.అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పి. నరసింహమూర్తి, మాజీ సర్పంచ్ నెల్లి బ్రహ్మాజీ, కూటి రంజిత్‌కుమార్, బత్తుల సూరిబాబు, మాజీ సర్పంచ్ పోతుల గనిరాజు, పోతురాజు భీమారావు, సన్నపు కుమారస్వామి, నాగాబత్తుల పావనమూర్తి తదితరులు పాల్గొన్నారు.

