-వెయ్యి మట్టి వినాయక ప్రతిమల పంపిణీ
-శుభకానుక ఫౌండర్ చింతకాయల దివ్యశ్రీ
నర్సీపట్నం, పెన్ పవర్ :
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నర్సీపట్నంలో భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చిన్న కోడలు, యువనేత చింతకాయల రాజేష్ సతీమణి, శుభకానుక ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చింతకాయల దివ్యశ్రీ ఆధ్వర్యంలో సుమారు 1000 మట్టి వినాయకులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్ట్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల వనరులకు జరిగే నష్టాలను వివరిస్తూ, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన మట్టి వినాయకులనే పూజించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చింతకాయల దివ్యశ్రీ మాట్లాడుతూ, మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, కులవృత్తులను నమ్ముకున్న చేతి వృత్తుల కళాకారులను ఆర్థికంగా ప్రోత్సహించినట్లు అవుతుందని ఆమె అన్నారు. ప్రకృతిని దైవంగా భావించి ఆరాధించడమే మన సనాతన ధర్మం అని, మట్టితో చేసిన స్వామిని పూజించి, తిరిగి పవిత్ర జలాల్లో కలపడం ద్వారా మన సంప్రదాయాలను, ధర్మాన్ని సముచితంగా కాపాడుకున్న వారం అవుతామని ఆమె స్పష్టం చేశారు. పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూనే, జల కాలుష్యాన్ని నివారించి మన భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించినప్పుడే మన సనాతన ధర్మానికి మరియు మూలాలకు నిజమైన గౌరవం దక్కుతుందని ఆమె ఉద్ఘాటించారు.

