తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దే స్వయం ఉపాధికి అవకాశం
అగరబత్తుల తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సుభాష్
కాజులూరు, పెన్‌పవర్, సెప్టెంబర్ 16:
గ్రామీణ మహిళలు తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవచ్చని జనసేన మహిళా నేత, ఏఎంసీ డైరెక్టర్ సలాది పుష్పవతి అన్నారు. మహిళలు వృత్తి నైపుణ్యాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అగరబత్తుల తయారీ, క్యాండిల్ తయారీ వంటి కుటీర పరిశ్రమలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.
కాజులూరు మండలం గొల్లపాలెం సొసైటీ భవనంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగరబత్తుల తయారీ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం ప్రారంభించారు.ఏఎంసీ డైరెక్టర్ సలాది పుష్పవతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన మంత్రి మహిళలతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ అగరబత్తుల తయారీ వంటి కుటీర పరిశ్రమల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.శిక్షణతో పాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల అనుసంధానానికి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.మహిళలు క్యాటరింగ్ రంగంలోనూ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న మహిళలకు క్యాటరింగ్‌కు అవసరమైన షామియానాలు ఏర్పాటు చేసి, కొన్ని కాంట్రాక్టు పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దే పరిశ్రమ
ఏఎంసీ డైరెక్టర్ సలాది పుష్పవతి మాట్లాడుతూ కుటీర పరిశ్రమలు గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం లేకుండానే ఇంటి వద్ద కుటుంబ సభ్యుల సహకారంతో ఇటువంటి పరిశ్రమలను నిర్వహించుకోవచ్చన్నారు. సుమారు రూ.10 వేల పెట్టుబడితో కూడా చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశముందని వివరించారు. అగరబత్తుల తయారీకి ప్రస్తుతం మార్కెట్‌లో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని పుష్పవతి తెలిపారు. యంత్రాల సహాయంతో గంటకు సుమారు 5 వేల నుంచి 10 వేల వరకు అగరబత్తులను తయారు చేసే అవకాశం ఉందన్నారు.అయితే యంత్రాల ధర సుమారు రూ.3 లక్షలకు పైగా ఉండవచ్చని తెలిపారు. మహిళలు సమూహాలుగా ఏర్పడి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల సహకారంతో యంత్రాలను సమకూర్చుకుంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అగరబత్తులతో పాటు క్యాండిల్ తయారీ, ఇతర చిన్న తరహా కుటీర పరిశ్రమలను కూడా గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించుకోవచ్చని ఆమె సూచించారు. మహిళలు ఉత్పత్తుల తయారీతో ఆగకుండా వాటి మార్కెటింగ్‌పై కూడా దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ కార్యక్రమాల ద్వారా అందించే రుణ సదుపాయాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.గొల్లపాలెంలో మహిళలకు అగరబత్తుల తయారీపై స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు.శిక్షణ ద్వారా తయారీ విధానంతో పాటు వ్యాపార నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్,టీడీపీ మండల అధ్యక్షుడు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు), యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ జయ సత్యవేణి,ఫ్యాకల్టీ శంకర్రావు,డీఆర్‌డీఏ అధికారులు,శిక్షకులు చైతన్య,ఏపీఎం టి.మురళీకృష్ణ,ఏఎంసీ వైస్ చైర్మన్ దడాల నాగేశ్వరి నాగార్జున,టీడీపీ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి, తాడి రామారెడ్డి శలపాక నీటి సంఘం అధ్యక్షులు, అంగర కృష్ణ,జనసేన మండల అధ్యక్షుడు బొండా వెంకన్న ,కోట తాతబ్బాయి, జనసేన నాయకులు తోట కృష్ణ, అంగర శ్రీను, చందాల మల్లిబాబు, కొల్లుహనుమంతు,నక్కా శ్రీను,నతదితరులు పాల్గొన్నారు.

