గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 3:
గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీ కృష్ణకుమార్ కుడికాలు తొడపై గుచ్చుకున్న చిన్న రాడుముక్కలను వైద్య బృందం శస్త్రచికిత్స చేసి తొలగించింది. గురువారం ఆస్పత్రికి వచ్చిన కృష్ణకుమార్‌ను పరిశీలించిన వైద్యులు తొడలో రాడుముక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, జనరల్ సర్జన్ డాక్టర్ కె. నాగేశ్వర్‌రావు పర్యవేక్షణలో మత్తు వైద్య నిపుణురాలు డాక్టర్ మౌనిష, స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించి రాడుముక్కలను విజయవంతంగా తొలగించారు. అదేవిధంగా ముగ్గురు మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, రెండు జనరల్ సర్జరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ మెర్సీ ఝాన్సీరాణి, నర్సింగ్ ఆఫీసర్ ఎం. స్వాతి, ఓటీ అసిస్టెంట్ పి. రవీందర్, విజయలక్ష్మి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

