బాపట్ల, సెప్టెంబర్ 22 (పెన్ పవర్): బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాన్ని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. నేర స్థలంలోనే శాస్త్రీయ ఆధారాలను సేకరించి, దర్యాప్తును మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హత్య, అత్యాచారం, దోపిడీ వంటి కీలక కేసుల్లో నేర స్థలానికి వెంటనే చేరుకుని ఆధారాలను సేకరించడం ద్వారా దర్యాప్తును వేగవంతం చేయవచ్చన్నారు. శాస్త్రీయ ఆధారాల ఆధారంగా కేసులను పక్కాగా దర్యాప్తు చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సహకారం తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల ఆధ్వర్యంలో అత్యాధునిక ఫోరెన్సిక్ పరికరాలతో ఈ మొబైల్ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నేర స్థలానికి చేరుకున్న వెంటనే వేలిముద్రలు, డీఎన్ఏ నమూనాలు, ఇతర కీలక ఆధారాలను శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించేందుకు ఈ వాహనం ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

