1, 2, 3 వార్డుల ప్రజల చిరకాల కోరికకు మోక్షం.. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశం
బాపట్ల, సెప్టెంబర్ 30 : బాపట్ల పట్టణంలోని 1, 2, 3వ వార్డుల పరిధిలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు శంకుస్థాపన చేశారు. జమ్ములపాలెం రోడ్డు, హోసన్న మందిరం సమీపంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకుండా, అధికారుల పర్యవేక్షణలో నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డు చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షుడు మందపాటి ఆంద్రెయ, మాజీ పట్టణ టీడీపీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, వడ్లమూడి వెంకటేశ్వర్లు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాల నారాయణ, 1వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సోముల ప్రసాద్, 2వ వార్డు టీడీపీ అధ్యక్షుడు అంకాల శ్రీనివాసరావు, 3వ వార్డు అధ్యక్షుడు యలవుల వెంకటేశ్వర్లు తదితర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

